Somu Veerraju: అబ్దుల్ కలాం వంటి మహానుభావులు కూడా తిరుమలలో డిక్లరేషన్ ఇచ్చారు: సోము వీర్రాజు
- ఏపీ మంత్రులు వాస్తవాలు తెలుసుకోవాలంటూ హితవు
- మతపరమైన రాజకీయాలు చేస్తోంది వైసీపీనే అంటూ విమర్శలు
- దేవాదాయ ఆస్తుల్ని ధారాదత్తం చేస్తే ఊరుకోబోమని హెచ్చరిక
ఏపీలో తాజాగా నెలకొన్న రాజకీయ పరిణామాలపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు స్పందించారు. ఏపీ మంత్రులు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలంటూ హితవు పలికారు. తిరుమలలో అన్యమతస్తుల డిక్లరేషన్-జగన్ అంశంపై ఆయన స్పందిస్తూ, అబ్దుల్ కలాం వంటి మహానుభావులు కూడా తిరుమలలో డిక్లరేషన్ ఇచ్చారని గుర్తుచేశారు. మతపరమైన రాజకీయాలు చేస్తోంది వైసీపీనే అని మండిపడ్డారు.
దేవాదాయ ఆస్తుల్ని ధారాదత్తం చేస్తామంటే ఊరుకోబోమని హెచ్చరించారు. ఈ ప్రభుత్వానికి ముస్లింలు, క్రైస్తవుల ఆస్తుల్ని పంచే ధైర్యం ఉందా? అని సోము వీర్రాజు ప్రశ్నించారు. బీజేపీ విధానం మతవాదం కాదని, జాతీయవాదమని ఆయన స్పష్టం చేశారు. సరికొత్త రాజధాని అంటూ చంద్రబాబు గ్రాఫిక్స్ తో మాయ చేశారని, కేంద్రానికి బాధ్యత ఉంది కాబట్టే రాజధానికి వందల కోట్లు కేటాయించిందని అన్నారు.