Hyderabad: బయోడైవర్సిటీ కారు ప్రమాదం.. వెయ్యి రూపాయల జరిమానాతో సరిపెట్టిన పోలీసులు!
- ప్రమాద సమయంలో కారు వేగం గంటకు 105 కిలోమీటర్లు
- బెలూన్లు తెరుచుకోవడంతో ప్రాణాలతో బయటపడిన మిలాన్ రావు
- చనిపోయిన సత్యవేణి కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం
సంచలనం సృష్టించిన బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్ కారు ప్రమాద ఘటనలో నిందితుడైన కారు డ్రైవర్ కల్వకుంట్ల కృష్ణ మిలాన్ రావుకు పోలీసులు వెయ్యి రూపాయల జరిమానా విధించారు. ఎంపవర్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట సొంత సంస్థను నిర్వహిస్తున్న ఆయన ప్రమాద సమయంలో స్వయంగా కారును డ్రైవ్ చేస్తున్నారు. ప్రమాద సమయంలో కారు వేగం 105 కిలోమీటర్లుగా ఉన్నట్టు నిర్ధారించిన పోలీసులు కేసు నమోదు చేశారు.
కారు కింద పడిన సమయంలో బెలూన్లు తెరుచుకోవడంతో మిలాన్రావు ప్రాణాలతో బయటపడ్డారు. కారును నిర్దేశిత వేగానికి మించి నడిపినందుకు గాను పోలీసులు ఆయనకు వెయ్యి రూపాయల జరిమానా విధించారు. కాగా, ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన సత్యవేణి కుటుంబానికి మేయర్ బొంతు రామ్మోహన్ రూ.5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు.