Rahul Gandhi: 'మహా' ఉత్కంఠపై లోక్ సభలో రాహుల్ గాంధీ మండిపాటు.. గందరగోళం మధ్య సభ వాయిదా
- సభాపతి పోడియంను చుట్టుముట్టిన విపక్ష నేతలు
- నినాదాలతో హోరెత్తించిన వైనం
- ప్రశ్నోత్తరాలు ముందుకు కొనసాగని పరిస్థితి
- రాజ్యసభ కూడా మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా
మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలపై లోక్ సభలో గందరగోళం నెలకొంది. సభాపతి పోడియంను చుట్టుముట్టి విపక్ష నేతలు నినాదాలతో హోరెత్తించారు. దీంతో ప్రశ్నోత్తరాలు ముందుకు కొనసాగని పరిస్థితి నెలకొంది. దీంతో లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు.
అంతకు ముందు సభలో మాట్లాడిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ... మహారాష్ట్రలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని మండిపడ్డారు. 'నేను ఓ ప్రశ్న అడగాలని అనుకున్నాను. కానీ, ఈ పరిస్థితుల్లో ఈ ప్రశ్న అడిగేందుకు కూడా అనువైన పరిస్థితులు లేవు' అని అన్నారు. ఈ విధంగా బీజేపీ వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు.
మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన ఎత్తివేయడంపై రాజ్యసభలోనూ ప్రతిపక్ష సభ్యులు గందరగోళం సష్టించారు. దీంతో రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు.