Chandrababu: ధర్మాడి సత్యాన్ని అడగండి ఎలాంటి టెక్నాలజీలు ఉన్నాయో చెబుతాడు: చంద్రబాబు
- కడప జిల్లాలో చంద్రబాబు పర్యటన
- జిల్లా క్యాడర్ తో సమావేశం
- వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కడప జిల్లాలో పర్యటిస్తున్నారు. అందులో భాగంగా జిల్లా టీడీపీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, వైసీపీ సర్కారుపై ధ్వజమెత్తారు. ఇసుక అంశంలో ఏపీ మంత్రులను తూర్పారబట్టారు. ఇసుకను రాష్ట్ర ప్రజలకు అందుబాటులో ఉంచకుండా, పోలీసు ఎస్కార్టుతో బెంగళూరు తరలిస్తున్నారని మండిపడ్డారు. కడప జిల్లాలో ఉండాల్సిన ఇసుక బెంగళూరులో కనిపిస్తోందని ఎద్దేవా చేశారు.
"టీడీపీ హయాంలో ఇసుక అక్రమరవాణా జరుగుతోందని ఆనాడు ఆరోపించారు. మరిప్పుడు మీరు చేస్తున్నదేంటి? మా హయాంలో ఇసుకధరలు ఎక్కువ ఉన్నాయని చెబుతున్న మీరు దానికంటే తక్కువ ధరకు ఎందుకు ఇవ్వడం లేదు? వీళ్లను ఏ భాషలో తిట్టాలో కూడా అర్థం కావడంలేదు. ఇసుకంతా నదులు, వాగుల్లో పెట్టాం, వరదొచ్చి కొట్టుకుపోయిందని చెబుతున్నారు. ఈ మంత్రులు, ఈ నాయకులు ఎవరి చెవుల్లో పూలు పెడతారు?
ఇంకొకాయన అడుగుతున్నాడు... వర్షాకాలంలో కూడా ఇసుక తీసే టెక్నాలజీ తెమ్మని! నేనివ్వక్కర్లా... అక్కడ ధర్మాడి సత్యం ఉన్నాడు. ఆయన్ను అడగండి... ఎలాంటి టెక్నాలజీలు ఉన్నాయో అన్నీ చెబుతాడు. గోదావరిలో మునిగిపోయిన బోటును ఈ చేతగాని ప్రభుత్వం తీయలేకపోతే ధర్మాడి సత్యమే బయటికి తీశాడు. చివరికి ధర్మాడి సత్యం వస్తే గానీ బోటును బయటికి తీయలేకపోయిందీ దద్దమ్మ వైసీపీ ప్రభుత్వం. ధర్మాడి సత్యంకున్న కమిట్ మెంట్ లో వీళ్లకు ఒక్క శాతం కూడా లేదు" అంటూ విమర్శించారు.