Telangana: సమ్మెపై మరోసారి వెనక్కి తగ్గిన టీఎస్ ఆర్టీసీ జేఏసీ.. విధుల్లో చేరతామని చెప్పిన అశ్వత్థామ రెడ్డి
- సమ్మె విరమిస్తున్నామని జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ ప్రకటన
- రేపటినుంచి విధులకు హాజరు కావాలని నిర్ణయం
- తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లు విధుల్లోకి రావద్దని వినతి
ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెపై జేఏసీ మరోసారి వెనక్కి తగ్గింది. సమ్మె విరమిస్తున్నట్లు ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి ప్రకటించారు. ఈ రోజు సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు, ఆర్టీసీని బతికించుకోవడానికి తాము కట్టుబడి ఉన్నామన్నారు. 52 రోజులపాటు కొనసాగించిన పోరాటంలో ఎవరమూ ఓడిపోలేదన్నారు.
తాము చేపట్టిన ఈ పోరాటం ఆర్టీసీని బతికించుకోవడానికి, కార్మికుల డిమాండ్లను నెరవేర్చుకోడానికి నాంది పలుకుతుందన్నారు. తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లు విధులకు హాజరుకావద్దని ఆయన కోరారు. రేపు ఉదయం 6 గంటలకు కార్మికులందరూ విధులకు హాజరై యాజమాన్యంపై ఒత్తిడి తేవాలని పిలుపు నిచ్చారు. విధుల్లోకి చేరే కార్మికులను ఎవరూ అడ్డుకోవద్దని ఆయన సూచించారు. సెకండ్ షిఫ్ట్ ఉద్యోగులు కూడా విధుల్లో చేరాలని పిలుపు నిచ్చారు.
ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన వస్తుందని ఆశించిన జేఏసీ, అటువంటి ప్రకటన రాకపోవడంతో.. విధుల్లో చేరాలని నిర్ణయించామని చెప్పారు. హైకోర్టు చేసిన సూచన ప్రకారం, ఆర్టీసీ యాజమాన్యం కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకుంటుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. కార్మికుల శ్రేయస్సు కోసమే సమ్మె విరమణ చేస్తున్నట్లు తెలిపారు.
‘రాష్ట్ర ప్రభుత్వం జీవో తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. ఆ జీవో కూడా చెల్లదు. ఉమ్మడి అంధ్రప్రదేశ్ లో ఉన్న ఏపీఎస్ ఆర్టీసీగానే తెలంగాణ ఆర్టీసీ ఇంకా కొనసాగుతోంది. విభజన జరుగలేదు. కార్మికులు అధైర్యపడవద్దు. రేపు కార్మికులందరూ స్వచ్ఛందంగా విధుల్లోకి వెళ్లాలని కోరుతున్నాము. ప్రభుత్వం బేషరుతుగా కార్మికులను విధుల్లోకి తీసుకుంటుందని భావిస్తున్నాం.
హైకోర్టు సూచనల ప్రకారం ప్రభుత్వం కార్మికులను విధుల్లోకి తీసుకుని ఒక ఉద్యోగికి, యాజమాన్యానికి ఉన్న సంబంధాలను కొనసాగించాలని కోరుతున్నాము. ఒకవేళ ఎవరినీ విధుల్లోకి రానీయకుంటే మా పోరాటం యథాతథంగా కొనసాగుతుంది. చనిపోయిన కార్మికుల కుటుంబాలు, ఒత్తిడికి గురైన కుటుంబాలకు జేఏసీ న్యాయం చేస్తుంది. కార్మికులందరూ రేపు విధుల్లో చేరాలి, ప్రజలు మా పోరాటానికి సహకరించాలి. సమస్యలు పరిష్కారం అయ్యేవరకు జేఏసీ కొనసాగుతుంది. లేబర్ కోర్టులో మాకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉంది’ అని అన్నారు.