Reliance Jio Revenue Market Share Increased: పుంజుకున్న జియో రెవెన్యూ మార్కెట్ వాటా!
- గ్రామీణ, మెట్రో నగరాల్లో విస్తరిస్తున్న జియో
- రెవెన్యూ మార్కెట్ వాటా పెంచుకుని ఎయిర్ టెల్ కు చెక్
- బ్రోకరేజీ సంస్థ ఎంకే గ్లోబల్ నివేదికలో వెల్లడి
ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికి గాను వెలువరించిన ఫలితాల్లో రిలయన్స్ జియో మంచి మార్కెట్ రాబడితో మళ్లీ అగ్ర స్థానానికి దూసుకు వచ్చింది. ఇటు తెలంగాణలో కూడా జియో 37 శాతం రెవెన్యూ మార్కెట్ వాటాతో తొలి స్థానాన్ని ఆక్రమించింది.
టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా బ్రోకరేజీ సంస్థ ‘ఎంకే గ్లోబల్’ తన నివేదికలో వివరాలను వెల్లడించింది. మొదటి స్థానంలో ఉన్న వొడాఫోన్ ఐడియా సెప్టెంబర్ తో ముగిసిన త్రైమాసికంలో 66 బేసిస్ పాయింట్లతో, 27.2 శాతం క్షీణతను నమోదు చేసింది. మొత్తం 22 ప్రధాన మార్కెట్లతో 20 సర్కిల్స్‌లో మార్కెట్ వాటాను కోల్పోయింది.
ముకేశ్ అంబానీ నేతృత్వంలోని జియో ఈ త్రైమాసికంలో 348 బేసిస్ పాయింట్లతో రెవెన్యూ మార్కెట్ వాటా 35 శాతానికి చేరుకోగా, భారతి ఎయిర్‌టెల్ (టాటా టెలీసర్వీస్ సహా) 32.1 శాతం రెవెన్యూ మార్కెట్ వాటాతో ఈ త్రైమాసికంలో 70 బీపీఎస్‌లు సాధించింది. కాగా జూన్ తో ముగిసిన క్వార్టర్‌లో జియో రెవెన్యూ మార్కెట్ వాటా 31.7 శాతంగా ఉండగా, ఎయిర్‌టెల్ రెవెన్యూ మార్కెట్ వాటా 30 శాతంగా ఉంది. తెలంగాణలో ఎయిర్ టెల్ 36.5 శాతం, వొడాఫోన్ ఐడియా 20శాతం మార్కెట్ వాటాతో ఉన్నాయి. ఈ త్రైమాసికంలో జియో 24 మిలియన్ల మంది సబ్ స్క్రైబర్లను చేర్చుకోగా, సంస్థ 4జీ యూజర్ల బేస్ 355.2 మిలియన్లకు చేరుకుంది.