Jagan: రాజధాని నిర్మాణ పనుల్లో రివర్స్ టెండరింగ్: సీఎం జగన్
- సీఆర్డీఏపై సీఎం జగన్ సమీక్ష
- పనులపై ఆరా
- ప్రాధాన్యత పరంగా పనులు కొనసాగించాలని సూచన
ఏపీ రాజధాని అమరావతిపై వైసీపీ ప్రభుత్వం సానుకూల ధోరణి కనబరుస్తున్నట్టు తెలుస్తోంది. సీఆర్డీఏపై సమీక్ష జరిపిన సీఎం జగన్ రాజధాని నిర్మాణ పనుల కొనసాగింపునకు నిర్ణయం తీసుకోవడమే అందుకు నిదర్శనం. రాజధానిలో నిర్మాణంలో ఉన్న పనుల కొనసాగింపునకు పచ్చజెండా ఊపారు. రాజధాని పరిధిలో ప్రాధాన్యతల పరంగా నిర్మాణ పనులు కొనసాగించాలని నిర్ణయించారు. క్షేత్రస్థాయిలో వాస్తవాలకు తగ్గట్టుగా పనులు ఉండాలని సీఎం సూచించారు. సీఆర్డీఏ పరిధిలో ఎక్కడా ప్లానింగ్ లో పొరబాట్లు ఉండకూడదని అధికారులకు స్పష్టం చేశారు.
ఇక్కడ కూడా ఖజానాపై భారం తగ్గించుకోవడానికి రివర్స్ టెండరింగ్ కు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. భూములిచ్చిన రైతుల ప్లాట్లను అభివృద్ధి చేసి అప్పగించాలని భావిస్తున్నారు. రాజధానిలో రోడ్ల నిర్మాణం పూర్తయిన తర్వాత మిగిలిపోయిన భూమిని బ్యూటిఫికేషన్ చేయాలని సూచించారు. నిలిచిపోయిన నిర్మాణ పనులకు నిధులిచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం జగన్ పేర్కొన్నారు. రాజధాని నిర్మాణ పనుల్లోనూ రివర్స్ టెండరింగ్ కు వెళతామని వెల్లడించారు.