Telangana: ఆర్టీసీ సమ్మెకు ఫుల్ స్టాప్ పెట్టే ఆలోచనలో కేసీఆర్!
- 50 రోజులకు పైగా సాగిన సమ్మె
- పట్టు వీడిన కార్మిక సంఘాలు
- ఓ మెట్టు దిగనున్న తెలంగాణ ప్రభుత్వం!
50 రోజులకు పైగా జరుగుతున్న తెలంగాణ ఆర్టీసీ సమ్మెకు ఫుల్ స్టాప్ పెట్టాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. సమ్మె విషయంలో అటు ఉద్యోగ సంఘాలు, ఇటు ప్రభుత్వం పట్టు వీడకుండా నెలన్నర రోజులకు పైగా గడిపిన తరువాత, కార్మికులే మెట్టు దిగి విధుల్లోకి వస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో, ఇకపై ఇటువంటి ఘటనలు జరుగరాదని, ముఖ్యంగా పర్వదినాల వేళ సంస్థకు నష్టం కలిగించేలా కార్మికులు ప్రవర్తించకుండా చూడాలని కొన్ని నియమ నిబంధనలతో వారిని తిరిగి విధుల్లోకి చేర్చుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది.
కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకునేందుకు కొన్ని విధి విధానాలు ఖరారు చేయాలని కేసీఆర్ సర్కారు భావిస్తున్నట్టు సమాచారం. ఇందుకోసం 28న ప్రత్యేక క్యాబినెట్ భేటీని నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సమావేశంలో ఆర్టీసీని ప్రభుత్వ పరం చేయాలన్న డిమాండ్ ను శాశ్వతంగా వదిలేయాలని, ఆపై నిర్దిష్ట కాలం పాటు మరోసారి సమ్మెకు దిగకుండా సంఘాలు, ఉద్యోగులతో సంతకాలు చేయించాలని నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
ఇదే సమయంలో ఆర్టీసీ సమ్మెపై పలు కేసులు కోర్టులో పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో అవి పరిష్కారం అయ్యేంతవరకూ వేచి చూడాలన్న అంశంపైనా చర్చ జరగనుంది. అయితే, ప్రయాణికుల ఇబ్బందులు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల రవాణా సమస్యలను దృష్టిలో ఉంచుకుని, ప్రభుత్వం కూడా ఓ మెట్టు దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ క్యాబినెట్ సమావేశం రెండు రోజులు జరుగుతుందని, 29వ తేదీన తుది నిర్ణయం వెలువడే అవకాశాలు ఉన్నాయని సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సివుంది.