Donald Trump: బాగ్దాదీని వెంటతరిమిన శునకానికి వైట్ హౌస్ లో ఆతిథ్యం ఇచ్చిన ట్రంప్
- బాగ్దాదీని మట్టుబెట్టే ఆపరేషన్ లో పాల్గొన్న కొనాన్
- కొనాన్ బెల్జియన్ మాలినోయిస్ జాతి శునకం
- ఆపరేషన్ లో స్వల్పగాయాలపాలైన కొనాన్
ఐసిస్ చీఫ్ అబూబకర్ అల్ బాగ్దాదీని హతమార్చడంలో ఓ మేలుజాతి శునకం ఎంతో కీలకపాత్ర పోషించింది. దానిపేరు కొనాన్. బెల్జియన్ మాలినోయిస్ జాతికి చెందిన కొనాన్ బాగ్దాదీని అంతమొందించే ఆపరేషన్ లో తనవంతు పాత్రను అద్భుతంగా నిర్వర్తించింది.
బాగ్దాదీని వెంటతరుముతూ గుహ చివర్లో నిలువరించింది. దాంతో విపరీతంగా భయపడిపోయిన బాగ్దాదీ అమెరికా దళాలకు చిక్కకుండా తనను తాను పేల్చేసుకున్నాడు. ఈ క్రమంలో కొనాన్ కు ఓ మోస్తరు గాయాలయ్యాయి. ప్రస్తుతం కోలుకుని విధుల్లో చేరిన ఈ వీర శునకానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ లో ఆతిథ్యం ఇచ్చారు.
తన ట్రయినర్ తో కలిసి వైట్ హౌస్ కు వచ్చిన కొనాన్ తో ట్రంప్, ఆయన భార్య మెలానియా ఉల్లాసంగా గడిపారు. కొనాన్ రాకకు సంతోషిస్తున్నామని, కొనాన్ వైట్ హౌస్ లో అడుగుపెట్టడం గౌరవంగా భావిస్తున్నామని ట్రంప్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ కూడా పాల్గొన్నారు. కొనాన్ ను రియల్ హీరో అంటూ అభివర్ణించారు.