Maharashtra: పిన్నమ్మ రాయబారంతో మనసు మార్చుకున్న అజిత్ పవార్!
- రంజుగా మహారాష్ట్ర రాజకీయాలు
- డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేసిన అజిత్ పవార్
- అజిత్ పవార్ తమవైపే ఉంటాడని రౌత్ వెల్లడి
మహారాష్ట్ర రాజకీయాలు ఓ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను మించిన ట్విస్టులతో రంజుగా మారాయి. తాజాగా డిప్యూటీ సీఎం పదవికి అజిత్ పవార్ రాజీనామా చేయడంతో బీజేపీ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా తయారైంది. పరిస్థితి చూస్తుంటే దేవేంద్ర ఫడ్నవీస్ కూడా సీఎం పదవికి రాజీనామా చేయక తప్పేట్టు లేదు. అసలు, అజిత్ పవార్ రాజీనామాకు దారితీసిన పరిస్థితులను పరిశీలిస్తే... ఈ పరిణామం వెనుక శరద్ పవార్ రాజకీయ అనుభవం, ఆయన భార్య ప్రతిభా పవార్ బుద్ధికుశలత ఉన్నట్టు తెలుస్తోంది.
ఎన్సీపీలో చీలిక తెచ్చి బీజేపీకి మద్దతుగా నిలిచినప్పుడు కనీసం తనవెంట 30 మంది ఎమ్మెల్యేలైనా వస్తారని అజిత్ పవార్ అంచనా వేశారు. కానీ శరద్ పవార్ ఎంతో చాకచక్యంగా వ్యవహరించి తమ ఎమ్మెల్యేలను హోటల్ కు తరలించి కాపాడుకున్నారు. మరోవైపు, శరద్ పవార్ భార్య అజిత్ పవార్ తో మంతనాలు జరిపి ఆయన మనసు మార్చడంలో సఫలమయ్యారు. ఇక బలనిరూపణలో తాము నిలబడలేమని గ్రహించిన అజిత్ పవార్, పిన్నమ్మ హితబోధతో మనసు మార్చుకుని డిప్యూటీ సీఎం పదవిని త్యజించినట్టు తెలుస్తోంది.
మరోవైపు, శివసేన కీలకనేత సంజయ్ రౌత్ మాట్లాడుతూ, ఉద్ధవ్ థాకరే మహారాష్ట్ర సీఎం అవుతారని, ఐదేళ్లపాటు ఆయనే సీఎం అని ధీమా వ్యక్తం చేశారు. అజిత్ పవార్ కూడా తమవైపే ఉన్నారని, అసెంబ్లీలో బలం తమదేనని వెల్లడించారు.