Mali: ఆఫ్రికాలో మరో విషాదం... 13 మంది ఫ్రెంచ్ సైనికుల దుర్మరణం
- మాలి దేశంలో ఘోరప్రమాదం
- ఆకాశంలో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు
- దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఫ్రాన్స్ అధ్యక్షుడు
ఇటీవలే ఆఫ్రికా దేశం కాంగోలో జరిగిన విమానప్రమాదం ఘటన మరువక ముందే మరో విషాదం చోటుచేసుకుంది. మాలి దేశంలో రెండు సైనిక హెలికాప్టర్లు ఆకాశంలో పరస్పరం ఢీకొనడంతో 13 మంది మృత్యువాత పడ్డారు. మరణించినవారందరూ ఫ్రాన్స్ దేశానికి చెందిన సైనికులే. ఇస్లామిక్ మిలిటెంట్ల ప్రాబల్యం ఉన్న మాలి ఉత్తరభాగంపై పట్టు సాధించేందుకు ఫ్రాన్స్ గత ఆరేళ్లుగా అక్కడి ప్రభుత్వానికి సైనిక సహకారం ఇస్తోంది. ఈ క్రమంలో యాంటీ మిలిటెంట్ ఆపరేషన్ల నిర్వహణ కోసం ఉద్దేశించిన హెలికాప్టర్లు పొరబాటున ఒకదాంతో ఒకటి ఢీకొన్నాయి. దీనిపై ఫ్రాన్స్ అధ్యక్షుడు జీన్ ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.