Maharashtra: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ థాకరే... కాంగ్రెస్, ఎన్సీపీలకు డిప్యూటీ సీఎం పదవులు?
- దేవేంద్ర ఫడ్నవీస్ రాజీనామా
- ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న మూడు పార్టీల కూటమి
- డిసెంబరు 1న సీఎంగా ఉద్ధవ్ థాకరే ప్రమాణస్వీకారం
మహారాష్ట్రలో మూడు పార్టీల కూటమి కొలువు దీరేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇంతక్రితమే సీఎం పదవికి దేవేంద్ర ఫడ్నవీస్ రాజీనామా చేయడంతో.. శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి తమకున్న సంఖ్యాబలంతో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు మొదలుపెట్టాయి. సీఎంగా ఉద్ధవ్ థాకరే, ఉపముఖ్యమంత్రులుగా ఎన్సీపీకి చెందిన జయంత్ పాటిల్, కాంగ్రెస్ నేత బాలాసాహెబ్ థొరాట్ వ్యవహరించే అవకాశాలున్నాయని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి.
ఇప్పటికే ప్రోటెమ్ స్పీకర్ గా కాళిదాస్ కొలాంబ్కర్ ను నియమించడంతో ఇక ప్రభుత్వ ఏర్పాటు మాత్రమే మిగిలుంది. కొలాంబ్కర్ రేపు కొత్త ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయిస్తారు. కాగా, డిసెంబరు 1న ఉద్ధవ్ థాకరే సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తారని, ముంబయిలోని శివాజీ పార్క్ మైదానంలో అందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలుస్తోంది.