MAA: ‘మా’ అధ్యక్షుడు నరేశ్ సంచలన వ్యాఖ్యలు
- ‘మా’లో ఆధిపత్య పోరు, వివాదాలు నిజమే
- ఈ క్షణమైనా పదవి నుంచి దిగిపోవడానికి సిద్ధం
- నేను అజాత శత్రువుని
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు, సీనియర్ నటుడు నరేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అధ్యక్ష పదవి నుంచి దిగిపోవడానికి తాను ఈ క్షణం కూడా సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. అంతమాత్రాన తనను ఎవరూ బయటకు పంపలేరని స్పష్టం చేశారు. ఎందుకంటే తాను సభ్యుల ఓట్లతోనే అధ్యక్షుడినయ్యానని పేర్కొన్నారు. తనకెవరూ శత్రువులు లేరని, అజాత శత్రువునని అన్నారు.
రఘుపతి ‘వెంకయ్యనాయుడు’ సినిమా విడుదల సందర్భంగా మీడియాతో మాట్లాడిన నరేశ్ ‘మా’లో నెలకొన్న వివాదాలపై స్పందించారు. ‘మా’ అనేది రాజకీయ పార్టీ కాదని, దానినో సేవా సంస్థగా భావించాలని అన్నారు. చిరంజీవి, కృష్ణంరాజు, మురళీమోహన్ వంటి పెద్దల సహకారంతో సంఘంలోని అందరినీ కలుపుకుని ముందుకు వెళ్తున్నట్టు చెప్పారు. తాను అధ్యక్షుడినయ్యాక ఆరు నెలలలోనే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను చేపట్టినట్టు గుర్తు చేశారు.
ప్రస్తుతం సినిమాల్లో కొంత బిజీగా ఉండడం వల్ల అనుకున్నది చేయలేకపోయానని నరేశ్ పేర్కొన్నారు. సంఘంలో ఆధిపత్య పోరు, వివాదాలు ఉన్న మాట నిజమేనని అంగీకరించారు. ఇప్పటికే తాను ఏడాది పూర్తి చేసుకున్నానని, మరో ఏడాది పదవీ కాలం ఉందని, పదవి నుంచి దిగిపొమ్మంటే ఈ క్షణమైనా దిగిపోయేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు. అలాగని తనను ఎవరూ బలవంతంగా బయటకు పంపలేరని తేల్చి చెప్పారు.