Hasinabi: ఇప్పటికీ పట్టుబడకుండా పోలీసులకు చుక్కలు చూపుతున్న గూడూరు తహసీల్దారు హసీనా!
- ఈ నెల 7న సోదరుడిని పంపి లంచం తీసుకున్న హసీనా బీ
- అనిశాకు పట్టుబడటంతో అప్పటి నుంచి పరారీలో
- హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు
తన సోదరుడిని మధ్యవర్తిగా పెట్టి, లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కినట్టే చిక్కి తప్పించుకుని తిరుగుతున్న గూడూరు తహసీల్దారు షేక్ హసీనాబీ ఆచూకీ ఇంతవరకూ లభించలేదు. ఓ పొలం విషయంలో తన సోదరుడు మహబూబ్ బాషాను పాణ్యం పంపి, లంచం తీసుకుంటూ ఈ నెల 7వ తేదీన పట్టుబడగా, అనిశా అధికారులు అతన్ని అరెస్ట్ చేసి, హసీనాబీ కోసం గాలింపు చేపట్టిన సంగతి తెలిసిందే. ఘటన జరిగి దాదాపు మూడు వారాలు అవుతున్నా, పోలీసులకు ఆమె ఆచూకీ చిక్కలేదు. ఆమె 5 గెస్ట్ హౌస్ లను అద్దెకు తీసుకుని రోజుకో చోట తలదాచుకుంటున్నట్టు పోలీసులు గుర్తించినట్టు సమాచారం.
కాగా, ఆమె హైకోర్టులో ముందస్తు బెయిల్ కు దరఖాస్తు చేసుకున్నారని పోలీసులు గుర్తించారు. ఆమె స్థానిక సీ-క్యాంప్ కార్యాలయంలోని ఓ ఎంపీడీఓ ఇంట్లో ఉన్నారని తెలిసి అక్కడికి వెళ్లిన పోలీసులకు ఆమె కనిపించలేదు. నెల రోజుల మెడికల్ లీవ్ పై ఆమె వెళ్లారని రెవెన్యూ అధికారులు వెల్లడించారు. నేరుగా లంచం తీసుకోలేదు కాబట్టి, ముందస్తు బెయిల్ తెచ్చుకోవచ్చని ఆమెకు సన్నిహితంగా ఉండే తహసీల్దార్లు సలహా ఇవ్వడంతోనే ఆమె హైకోర్టును ఆశ్రయించినట్టు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న ఏసీబీ అధికారులు, బెయిల్ ఇవ్వద్దని కోర్టును అభ్యర్థించారు.