shiv sena: ప్రతి ఒక్కరు నన్ను ఎద్దేవా చేశారు.. చివరకు నేను చెప్పిందే జరిగింది: సంజయ్ రౌత్
- మా మిషన్ పూర్తయింది
- సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఉద్ధవ్ సిద్ధమయ్యారు
- అజిత్ పవార్ భవిష్యత్తులో మా కూటమిలో కీలక పాత్ర పోషిస్తారు
'మహారాష్ట్రకు తదుపరి ముఖ్యమంత్రి శివసేన నుంచే'... ఈ వ్యాఖ్యను శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ ఇటీవల పదే పదే చెప్పారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల అనంతరం బీజేపీతో వచ్చిన విభేదాల కారణంగా శివసేన ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సంజయ్ రౌత్ ఈ వ్యాఖ్యను దాదాపు ప్రతి రోజు చేశారు. చివరకు ఆయన చెప్పిందే జరిగింది. దీనిపై ఆయన ఓ ఇంటర్వ్యూలో స్పందించారు.
'మహారాష్ట్రకు తదుపరి ముఖ్యమంత్రి శివసేన నుంచే అంటూ నేను చేసిన వ్యాఖ్య పట్ల ప్రతి ఒక్కరూ ఎద్దేవా చేశారు. మా మిషన్ పూర్తయింది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే సిద్ధమయ్యారు' అని సంజయ్ రౌత్ అన్నారు. ఎన్సీపీ నేత అజిత్ పవార్ భవిష్యత్తులో తమ కూటమిలో కీలక పాత్ర పోషిస్తారని చెప్పారు. మహారాష్ట్రలో అధికారంలోకి వచ్చిన తరహాలోనే ఢిల్లీలోనూ తాము పాగా వేసినా ఇందులో ఆశ్చర్యం ఏమీ ఉండబోదని చెప్పారు. మహారాష్ట్ర నుంచే భారత్ లో గొప్ప మార్పు ప్రారంభమవుతుందని వ్యాఖ్యానించారు.