Trupti Desai: మంకు పట్టు వీడి... కేరళ నుంచి వెళ్లిపోయిన తృప్తీ దేశాయ్!

  • అయ్యప్పను దర్శించుకునేందుకు వచ్చిన తృప్తీ దేశాయ్
  • భద్రత కల్పించలేమని స్పష్టం చేసిన పోలీసులు
  • వెనక్కు వెళ్లేందుకు అంగీకరించిన తృప్తి
శబరిమలకు వెళ్లి, అయ్యప్ప స్వామిని దర్శించుకున్న తరువాతనే కేరళను వదిలి వెళతానని స్పష్టం చేసి, గత రెండు రోజులుగా కొచ్చిలో మకాం వేసిన భూమాతా బ్రిగేడ్ నాయకురాలు తృప్తీ దేశాయ్, ఎట్టకేలకు మంకుపట్టు వీడి తిరుగు ప్రయాణమయ్యారు. ఈ రోజు ఎర్నాకులం సిటీ పోలీస్ కమిషనర్ కార్యాలయానికి ఆమె రాగా, భద్రత కల్పించలేమని, పరిస్థితిని అర్థం చేసుకోవాలని పోలీసు అధికారులు ఆమెను కోరారు. ఇంతలోనే తృప్తీ దేశాయ్, అక్కడ ఉన్నారన్న విషయం తెలుసుకుని వచ్చిన శబరిమల కర్మ సమితి సభ్యులు, ఆందోళనకు దిగారు. ఆపై తిరిగి పూణె వెళ్లేందుకు తృప్తి అంగీకరించారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆమె, మహిళల ప్రవేశంపై సుప్రీంకోర్టు స్టే ఇవ్వలేదని గుర్తు చేశారు. కేరళలో తనకు ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయని, సాక్షాత్తు కమిషనర్ కార్యాలయమే భద్రత కల్పించే విషయంలో చేతులెత్తేసిందని అన్నారు. తనతో పాటు ఉన్న మహిళల భద్రతను దృష్టిలో పెట్టుకునే వెనక్కు వెళుతున్నానని, భవిష్యత్ లో మరోసారి వస్తానని ఆమె అన్నారు.
Trupti Desai
Kerala
Sabarimala

More Telugu News