Ramesh Solanki: శివసేనలో లుకలుకలు మొదలు... యువనేత రాజీనామా!
- బాబాసాహెబ్ యువసేన నేత రమేశ్ సోలంకి
- కాంగ్రెస్ తో కలిసి పనిచేయలేనంటూ రాజీనామా
- ట్విట్టర్ లో వెల్లడించిన యువనేత
మహారాష్ట్రలో శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న సమయంలో ఆ పార్టీలో విభేదాలు బయటకు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీతో కలవడాన్ని ఆక్షేపిస్తూ, బాబాసాహెబ్ యువసేన నేత రమేశ్ సోలంకి పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టిన ఆయన, కాంగ్రెస్ తో కలిసి పనిచేయడానికి తన మనసు అంగీకరించడం లేదని తెలిపారు. అర్ధ మనసుతో తాను పని చేయలేనని చెప్పారు.
కొత్త ముఖ్యమంత్రిగా శివసేన నేత బాధ్యతలు స్వీకరించనుండటం తనకు సంతోషకరమేనని, అయితే, తన మనసు మాత్రం కాంగ్రెస్ తో కలిసేందుకు ఒప్పుకోవడం లేదని, అందువల్లే తాను రాజీనామా చేస్తున్నానని తెలిపారు. ముంబైలోని ఫైవ్ స్టార్ హోటల్ లో ఎన్సీపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సేన ఎమ్మెల్యేలు కలసిన నాటి నుంచి సోలంకి మనస్తాపంతో ఉన్నట్టు ఆయన వర్గీయులు అంటున్నారు. గడచిన 21 సంవత్సరాలుగా శివసేనతో కొనసాగిన ఆయన, రాజీనామా చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. కాగా, ఇటీవల స్ట్రీమింగ్ వెబ్ సైట్ నెట్ ఫ్లిక్స్ ను సెన్సార్ చేయాలని డిమాండ్ చేసి వార్తల్లో నిలిచారు సోలంకి.