Congress: ఉప ముఖ్యమంత్రి పదవి వద్దు.. స్పీకర్ పదవి కావాలి: మహారాష్ట్రలో పదవుల పంపకంపై కాంగ్రెస్ లో కీలక చర్చలు
- ఎన్సీపీ, శివసేనతోనూ కాంగ్రెస్ చర్చలు
- ముంబయి చేరుకున్న కాంగ్రెస్ నేతలు
- శరద్ పవార్ తో ఖర్గే, షిండే భేటీ
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే ప్రమాణ స్వీకారానికి సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పదవులపై కాంగ్రెస్ పార్టీ నేతలు కీలక చర్చలు జరుపుతున్నారు. ఉప ముఖ్యమంత్రి పదవికి బదులుగా స్పీకర్ పదవి కోరే యోచనలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్లు తెలిసింది. ఈ విషయంపై కాంగ్రెస్ అధిష్ఠానంతో చర్చించిన ఆ పార్టీ నేతలు మల్లికార్జున ఖర్గే, సుశీల్ కుమార్ షిండే, అహ్మద్ పటేల్, కేసీ వేణు గోపాల్ ముంబయికి చేరుకున్నారు. శివసేనతోనూ ఆ పార్టీ నేతలు చర్చించనున్నట్లు తెలుస్తోంది.
ముంబయిలోని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నివాసం వద్ద ఆయనతో కాంగ్రెస్ నేతలు సమావేశం అయ్యారు. మహారాష్ట్రలో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే సన్నాహాలు మొదలుపెట్టింది. ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ థాకరే, ఉప ముఖ్యమంత్రులుగా ఎన్సీపీ నేత జయంత్ పాటిల్, కాంగ్రెస్ నేత బాలాసాహెబ్ థొరాట్ బాధ్యతలు స్వీకరించే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరిగింది.