Siddaramaiah: మహారాష్ట్ర రాజకీయ పరిణామాల్లో మోదీ జోక్యం కూడా ఉంది: సిద్ధరామయ్య
- మహారాష్ట్ర పరిణామాలు బీజేపీకి చెంపపెట్టులాంటివి
- మెజారిటీ లేదని తెలిసినప్పటికీ సీఎంగా ఎలా ప్రమాణ స్వీకారం చేస్తారు?
- ఇది రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే అవుతుంది
మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం కుప్పకూలడం బీజేపీకి చెంపపెట్టులాంటిదని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. మహారాష్ట్ర రాజకీయ పరిస్థితులను ప్రస్తావిస్తూ బీజేపీపై ఆయన విమర్శలు గుప్పించారు. మహారాష్ట్ర రాజకీయ పరిణామాల్లో ప్రధానమంత్రి మోదీ జోక్యం కూడా ఉందన్నారు.
ఈ రోజు సిద్ధరామయ్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'మహారాష్ట్రలో జరిగిన పరిణామాలు బీజేపీకి చెంపపెట్టువంటివి. తమకు మెజారిటీ లేదని తెలిసినప్పటికీ బీజేపీ నేత ఫడ్నవీస్.. ముఖ్యమంత్రిగా ఎలా ప్రమాణ స్వీకారం చేస్తారు?' అని ప్రశ్నించారు.
'ఇది రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే అవుతుంది. ప్రజాస్వామ్యాన్ని అవమాన పరిచారు. ఈ విషయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జోక్యం కూడా ఉంది. ఈ కుట్రలో ఆయన కూడా భాగస్వామే' అని సిద్ధరామయ్య విమర్శించారు. కాగా, బలపరీక్షను ఎదుర్కోవాలని నిన్న సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రి పదవికి ఫడ్నవీస్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే.