Gachibowli: బయోడైవర్సిటి వద్ద ఫ్లైఓవర్ ను కూల్చేసి మళ్లీ నిర్మించాలి: సీపీఐ నారాయణ

  • గచ్చిబౌలి ఫ్లైఓవర్ ని పరిశీలించిన నారాయణ
  • ఫ్లైఓవర్ పై ఎక్కువ మలుపులు వున్నాయి
  • ప్రభుత్వ వైఫల్యమే కారణమన్న నారాయణ

గచ్చిబౌలిలోని బయోడైవర్సిటి పార్కు వద్ద వున్న ఫ్లైఓవర్ పై నుంచి అతివేగంతో దూసుకొస్తున్న కారు కింద పడిన దారుణ ఘటన తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫ్లైఓవర్ ను సీపీఐ బృందంతో కలిసి ఆ పార్టీ నేత నారాయణ పరిశీలించారు. అనంతరం, మీడియాతో ఆయన మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఫ్లైఓవర్ పై ఎక్కువ మలుపులు వున్నాయని, అందుకే, ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని అన్నారు. ఈ ఫ్లైఓవర్ ను పూర్తిగా పడగొట్టి మళ్లీ నిర్మించాలని, ఎక్కువ మలుపులు లేకుండా ఉండేలా తగు జాగ్రత్తలు తీసుకుని నిర్మించాలని డిమాండ్ చేశారు. ఈ ప్రమాదానికి కారణం ప్రభుత్వ వైఫల్యమేనని ఆరోపించారు.

‘మై హోమ్’ అధినేతకు చెందిన స్కై వ్యూ బిల్డింగ్ లకు నష్టం కలగకుండా, వాస్తు చెడిపోకుండా వుండేందుకే ఫ్లై ఓవర్ పై అనేక మలుపులు వచ్చేలా నిర్మించారని ఆరోపించారు. ఈ ప్రమాద ఘటనపై నిపుణుల కమిటీ నిష్పక్షపాతంగా నివేదిక రూపొందించాలని, ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా న్యాయబద్ధంగా రిపోర్టు ఇవ్వాలని కోరారు. ఒకవేళ ఈ నివేదిక సంతృప్తికరంగా లేకపోతే హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని డిమాండ్ చేస్తామని చెప్పారు.

  • Loading...

More Telugu News