Maharashtra: మహారాష్ట్రలో మేం కనుక ప్రచారం చేసి ఉంటేనా.. !: బీజేపీ సీనియర్ నేత ఏక్నాథ్ ఖడ్సే
- మేం ప్రచారం చేసి ఉంటే మరో 25 సీట్లు వచ్చేవి
- అజిత్ పవార్‌తో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి బీజేపీ తప్పుచేసింది
- మమ్మల్ని ఉద్దేశపూర్వకంగానే ప్రచారానికి దూరంగా ఉంచారు
ఇటీవల మహారాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ప్రచారంలో తాము కనుక ప్రచారం చేసి ఉంటే బీజేపీకి మరో 25 సీట్లు అదనంగా వచ్చి ఉండేవని ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఏక్నాథ్ ఖడ్సే అన్నారు. తనతోపాటు చంద్రశేఖర్ భవాంకులే, వినోద్ తాడ్వే సహా మరికొందరు నేతలను ఉద్దేశపూర్వకంగానే ప్రచారానికి దూరంగా ఉంచారని ఖడ్సే ఆరోపించారు.
ఈ విషయాన్ని ఇప్పటికే పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. అవినీతి ఆరోపణలున్న అజిత్ పవార్ లాంటి వారితో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం వల్ల బీజేపీ ప్రతిష్ఠ దెబ్బతిందని ఏక్నాథ్ అన్నారు. కాగా, గతంలో రెవెన్యూ మంత్రిగా పనిచేసిన సమయంలో ఏక్‌నాథ్‌పై అవినీతి ఆరోపణలు రావడంతో 2016లో మంత్రి పదవికి రాజీనామా చేశారు. దీంతో ఆయనను ఇటీవల జరిగిన ఎన్నికల ప్రచారం నుంచి అధిష్ఠానం దూరంగా ఉంచింది.