USA: తమిళనాడు ఆటోల్లో అధిక వసూళ్లపై అమెరికా పోలీసులకు ఫిర్యాదు!
- తమిళనాడులోని సేలంకు వెళ్లిన కేరళ టూరిస్ట్
- 1.5 కిలోమీటర్ల దూరానికి రూ. 50
- పొరపాటున యూఎస్ లోని సేలం పోలీసులకు ట్యాగ్
కేరళకు చెందిన ఓ వ్యక్తి, తమిళనాడులోని సేలం ప్రాంతానికి వెళ్లి, అక్కడ ఆటోవాలాల అడ్డగోలు వసూళ్లపై ట్విట్టర్ ఖాతాలో పోలీసులకు ఫిర్యాదు చేయగా, అమెరికన్ పోలీసులు స్పందించారు. అదెలా సాధ్యమని అనుకుంటున్నారా? సేలంకు వచ్చిన కేరళ వాసి, ఒకటిన్నర కిలోమీటర్ల దూరం వెళ్లేందుకు రూ. 50 చెల్లించాడు.
ఇదే విషయాన్ని సేలం పోలీసు శాఖకు, తమిళనాడు ముఖ్యమంత్రి ఆఫీసుకు ట్యాగ్ చేస్తూ, తన బాధను వ్యక్తం చేశాడు. పర్యాటకుల నుంచి అధిక చార్జీలు వసూలు చేస్తున్నారని ఫిర్యాదు చేశాడు. ఇటువంటి అక్రమాలపై దృష్టిని సారించే సిస్టమ్ ఏదైనా ఉందా? అని ప్రశ్నించాడు.
అయితే, ఇంతవరకూ బాగానే ఉంది. కానీ, ట్విట్టర్ లో ఈ టూరిస్ట్ చేసిన ట్యాగ్, అమెరికాలో ఉన్న సేలం పోలీసు విభాగానిది. యూఎస్ లోని ఓరెగాన్ ప్రాంతంలోనూ సేలం అనే ఏరియా ఉంది. తమను ట్యాగ్ చేస్తూ, ట్వీట్ రావడంతో అవాక్కైన వారు, సమాధానం ఇచ్చారు. తాము అమెరికాలోని సేలం పోలీసులమని తెలిపారు. ఇక ఈ ట్వీట్లను ఓ పోలీసు అధికారి స్క్రీన్ షాట్ తీసి, సోషల్ మీడియాలో పెట్టగా, అది తెగ చక్కర్లు కొడుతోంది.