India: పాకిస్థాన్ నుంచి వచ్చిన 21 మంది హిందువులకు భారత పౌరసత్వం!
- జైపూర్‌కు వలస వచ్చిన భారతీయులకు పౌరసత్వం
- ఉత్తర్వులు జారీ చేసిన జైపూర్ కలెక్టర్
- వలస వచ్చిన 1310 మందికి పౌరసత్వం ఇవ్వనున్న ప్రభుత్వం
రాజస్థాన్‌లోని జైపూర్ జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పాకిస్థాన్ నుంచి వచ్చిన 21 మంది హిందువులకు భారత పౌరసత్వం కల్పించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. పాకిస్థాన్ నుంచి రాజస్థాన్‌లోని జోధ్‌పూర్, జైసల్మేర్, జైపూర్ జిల్లాలకు వలస వచ్చిన 1310 మందికి భారత పౌరసత్వం ఇవ్వనున్నట్టు ఇటీవల కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ లోక్‌సభలో ప్రకటించారు.
కాగా, ఈ ఏడాది జనవరి 8న భారత ప్రభుత్వం ఓ చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం.. 31 డిసెంబరు 2014లోపు పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ దేశాల నుంచి భారత్‌కు వలస వచ్చిన ముస్లిమేతరులకు పౌరసత్వం ఇవ్వనున్నారు. తాజాగా, ఇందులో భాగంగానే జైపూర్ కలెక్టర్ 21 మంది పాక్ హిందువులకు పౌరసత్వం ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.