kerala: ఐసిస్ తో సంబంధాలు...ఆఫ్ఘనిస్థాన్ లో కేరళ మహిళ అరెస్టు!
- మతం మారి ఉగ్రవాదుల్లో చేరిన యువతి
- మూడేళ్ల క్రితం సిరియాకి వెళ్లిన నిందితురాలు
- అప్పుడే అనుమానించి ఫిర్యాదు చేసిన తల్లి
మతం మార్చుకుని మూడేళ్ల క్రితం దేశం వదిలి సిరియా వెళ్లిన ఓ కేరళ మహిళకు ఐసిస్ తో సంబంధాలున్నాయన్న అనుమానంతో ఆఫ్ఘనిస్థాన్ పోలీసులు అరెస్టు చేశారు. కేరళ రాష్ట్రానికి చెందిన నిమిషా మూడేళ్ల క్రితం అదృశ్యమైంది. బెక్టిన్ అనే యువకుడిని పెళ్లాడిన ఈమె పెళ్లి అనంతరం మూడేళ్ల క్రితం మతంమారి తన పేరును ఫాతిమాగా మార్చుకుంది.
అనంతరం సిరియా వెళ్లిపోయింది. కుమార్తె కనిపించకపోవడంతో ఆమె ఉగ్రవాదుల్లో చేరి ఉంటుందన్న అనుమానంతో ఆమె తల్లి 2016లోనే అప్పటి కేంద్ర మంత్రి గెహ్లాట్ ను కలిసి, కుమార్తె అదృశ్యంపై దర్యాప్తు జరిపించాలని విజ్ఞప్తి చేశారు. తాజాగా ఆఫ్ఘనిస్థాన్ పోలీసులు నిమిషా అలియాస్ ఫాతిమాను అరెస్టు చేసి ఆమెకు సంబంధించిన ఫొటోలు, వివరాలు ఎన్ఐఏకి అందించారు. విచారణలో భాగంగా ఎన్ఐఏ చూపిన ఫొటోలను నిమిషా తండ్రి గుర్తించడంతో అప్పట్లో ఫాతిమా ఉగ్రశిబిరంలో చేరిపోయేందుకే సిరియా వెళ్లి ఉంటుందని భావిస్తున్నారు.