cm: ప్రజాధనంతో పాస్టర్లకు, ఇమామ్ లకు వేతనాలు ఎలా ఇస్తారు?: సీఎం జగన్ కు సోము వీర్రాజు సూటి ప్రశ్న
- ఎండోమెంట్ శాఖ, ఆలయాల ఆస్తుల నుంచి పూజార్లకు జీతభత్యాలు ఇస్తున్నారు
- క్రైస్తవ సంస్థల ఆస్తుల నుండి పాస్టర్లకు జీతాలివ్వాలి
- టీటీడీ బోర్డును రాజకీయాలకు దూరంగా వుంచాలి
పాస్టర్లకు, ఇమామ్ లకు ప్రజాధనంతో వేతనాలు ఇవ్వాలని సీఎం జగన్ భావించడం తగదని బీజేపీ నేత సోము వీర్రాజు అన్నారు. విజయనగరంలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఎండోమెంట్ శాఖ, హిందూ దేవాలయాల ఆస్తుల నుంచి పూజార్లకు జీతభత్యాలను ఇస్తున్నప్పుడు, ప్రజాధనంతో వీరికి వేతనాలు ఎలా ఇస్తారని జగన్ కు సూటి ప్రశ్న వేశారు. పాస్టర్లకు జీతాలు ఇవ్వాలంటే క్రైస్తవ సంస్థల ఆస్తుల నుండి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు గురించి ఆయన ప్రస్తావించారు. టీటీడీ బోర్డును రాజకీయాలకు దూరంగా వుంచాలని, చైర్మన్లుగా మఠాధిపతులను లేదా స్వామీజీలను నియమించాలని డిమాండ్ చేశారు. టీటీడీని ఏ విధంగా అయితే గత ప్రభుత్వాలు రాజకీయమయం చేశాయో, ఇప్పుడు జగన్ కూడా అదేవిధంగా చేస్తున్నారని విమర్శించారు.