Bumrah: బుమ్రా బౌలింగ్ యాక్షన్ పై కపిల్ దేవ్ వ్యాఖ్యలు
- విండీస్ పర్యటన తర్వాత బుమ్రాకు గాయం
- వెన్నుపూసలో చీలిక
- బౌలింగ్ యాక్షన్ కారణంగానే బుమ్రాకు గాయాలంటున్న కపిల్
టీమిండియా సంచలన పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఇటీవల కాలంలో అనేకజట్లకు సింహస్వప్నంలా మారాడంటే అతిశయోక్తి కాదు. పదునైన పేస్, బంతిని రెండు వైపులా నాట్యం చేయించగల నైపుణ్యం బుమ్రాను అరుదైన ప్రతిభావంతుడిగా మార్చాయి. అయితే, వెస్టిండీస్ పర్యటన అనంతరం గాయపడిన బుమ్రా అనేక సిరీస్ లకు దూరమయ్యాడు. ప్రస్తుతం వెన్నుపూస గాయం నుంచి కోలుకుని ముమ్మరంగా ప్రాక్టీసు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో, భారత పేస్ బౌలింగ్ దిగ్గజం కపిల్ దేవ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
బుమ్రా తరహా బౌలింగ్ యాక్షన్ తో గాయపడేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అభిప్రాయపడ్డారు. బుమ్రా బౌలింగ్ శైలి గమనిస్తే, అతని చేతి కంటే శరీరమే ఎక్కువ శ్రమకు గురవుతుందని, అదే అతడి గాయానికి మూలకారణమని తాను భావిస్తున్నట్టు తెలిపారు. ఇలాంటి కష్టసాధ్యమైన యాక్షన్ తో దీర్ఘకాలంలో మరింతగా గాయపడే అవకాశాలున్నాయని అన్నారు.