Forbes: ఫోర్బ్స్ ప్రపంచ కుబేరుల టాప్-10 జాబితాలోకి దూసుకెళ్లిన రిలయన్స్ అధినేత
- 9వ స్థానంలో ముఖేశ్ అంబానీ
- రూ.10 లక్షల కోట్ల మార్కెట్ కాప్ ను తాకిన రిలయన్స్
- లారీ పేజ్, సెర్గీ బ్రిన్ లను వెనక్కినెట్టిన రిలయన్స్ అధినేత
రిలయన్స్ వ్యాపార సామ్రాజ్య అధినేత ముఖేశ్ అంబానీ ప్రపంచ ప్రఖ్యాత ఫోర్బ్స్ టాప్-10 కుబేరుల జాబితాలో స్థానం సంపాదించుకున్నారు. ముఖేశ్ అంబానీ ఈ జాబితాలో 9వ స్థానానికి దూసుకెళ్లారు. రిలయన్స్ సంపద ఇవాళ రూ.10 లక్షల కోట్ల మార్కును అందుకోవడంతో ముఖేశ్ అంతర్జాతీయ కుబేరుల రేసులో ఒక్కుదుటున ఎగబాకారు.
ప్రపంచ ఆర్థిక లావాదేవీలు, వాణిజ్య పరిణామాల ఆధారంగా ఫోర్బ్స్ ఎప్పటికప్పుడు రియల్ టైమ్ ర్యాంకింగ్స్ ప్రకటిస్తుంటుంది. ఈ విధంగా ప్రకటించిన తాజా ర్యాంకుల్లో ముఖేశ్ కు 9వ ర్యాంకు లభించింది. ఈ క్రమంలో ఆయన గూగుల్ వ్యవస్థాపకులు లారీ పేజ్, సెర్గీ బ్రిన్ లను వెనక్కి నెట్టారు. లారీ పేజ్ సంపద 59.6 బిలియన్ల డాలర్లు కాగా, ముఖేశ్ సంపద విలువను ఫోర్బ్స్ 60.7 బిలియన్ డాలర్లుగా పేర్కొంది.
ఇక, ఫోర్బ్స్ టాప్-10 జాబితాలో అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ (113 బిలియన్ డాలర్లు), ఎల్వీఎంహెచ్ చీఫ్ బెర్నార్డ్ ఆర్నాల్ట్, బిల్ గేట్స్ తొలి మూడు స్థానాల్లో ఉన్నారు.