TSRTC: వారి సంగతి సరే...ఇప్పుడు మేమేం చేయాలి?: టీఎస్ ఆర్టీసీ తాత్కాలిక ఉద్యోగుల ఆవేదన
- వారు కుదురుకున్నారు... సంతోషం
- మేము మాత్రం రోడ్డున పడ్డాం
- మాకూ ఏదో ఒకదారి చూపించాలని వేడుకోలు
టీఎస్ఆర్టీసీ సమ్మె ముగిసి కార్మికులు విధుల్లో చేరడంతో పెద్ద సమస్య పరిష్కారమైనా సమ్మెకాలంలో విధులు నిర్వహించిన తాత్కాలిక ఉద్యోగులు రోడ్డున పడ్డారు. కార్మికులు సమ్మెకు దిగడంతో దాదాపు రెండు నెలలపాటు వీరు విధులు నిర్వహించి ప్రత్యామ్నాయ రవాణాకు సహకరించారు. రెగ్యులర్ ఉద్యోగులు రావడంతో ప్రస్తుతం సంస్థకు వీరి అవసరం లేకుండా పోయింది.
దీంతో తమ పరిస్థితి ఏమిటని వీరు ప్రశ్నిస్తున్నారు. 'సమ్మె ముగిసింది. కార్మికుల ఉద్యోగాలు వారికి వచ్చాయి. సంతోషం. సమ్మెకాలంలో ప్రభుత్వానికి అండగా నిలబడి ప్రజలకు అసౌకర్యం కలగకుండా చేశాం. కానీ ఇన్నాళ్లూ సేవలందించి ఇప్పుడు మేము రోడ్డుపై అసహాయతతో నిల్చున్నాం. ముఖ్యమం త్రి కేసీఆర్ మాపట్ల కూడా సానుభూతి చూపి ఏదో ఒక దారి చూపించాలి' అంటూ వీరు వేడుకుంటున్నారు.
జీడిమెట్ల బస్సు డిపో వద్ద తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లు ఈ రోజు ఉదయం తమ ఆవేదన వ్యక్తం చేస్తూ భవిష్యత్తులో ఆర్టీసీ ఉద్యోగాల భర్తీ సమయంలోనైనా తమ సేవలను పరిగణనలోకి తీసుకుని ప్రాధాన్యం ఇస్తే సంతోషిస్తామని తెలిపారు.