Andhra Pradesh: డీజీపీ సవాంగ్ అనుమతి ఇవ్వకపోతే ఆయన్ని వైసీపీ కార్యకర్తగా పరిగణిస్తాం: అచ్చెన్నాయుడు
- బాబు ప్రయాణిస్తున్న బస్సుపై పోలీసు లాఠీ విసిరాడు
- ఆ లాఠీ ఎవరు విసిరారో డీజీపీ చెప్పాలి
- జగన్ పర్యటన సమయంలో నిరసనలు తెలిపేందుకు అనుమతిస్తారా?
ఏపీ రాజధాని అమరావతిలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కాన్వాయ్ పై దాడి జరగడంపై ఆ పార్టీ నేత అచ్చెన్నాయుడు స్పందించారు. పోలీసుల తీరుపై ఆయన మండిపడ్డారు. నిన్న రాజధానిలో పర్యటిస్తున్న సమయంలో చంద్రబాబు ప్రయాణిస్తున్న బస్సుపై ఓ పోలీసు లాఠీ విసిరాడని ఆరోపించారు. ఆ లాఠీ ఎవరు విసిరారో ఏపీ డీజీపీ చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు కాన్వాయ్ పై దాడి ఘటనకు సీఎం జగన్, డీజీపీ సవాంగ్ బాధ్యత వహించాలని అన్నారు.
జగన్ పర్యటన సమయంలో తాము కూడా నిరసనలు తెలుపుతామని, ఇందుకు డీజీపీ అనుమతి ఇవ్వాలని, లేనిపక్షంలో ఆయన్ని వైసీపీ కార్యకర్తగా పరిగణిస్తామని అన్నారు. టీడీపీ హయాంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఆరోపిస్తున్న వైసీపీ నేతలు, ఇప్పుడు వారి ప్రభుత్వమే వుంది కనుక తమపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.