Tiger: భలే రైతు.. కోతులను తరిమేందుకు పెంపుడు కుక్కకు పులివేషం!
- కర్ణాటక రైతుకొత్త ఆలోచన
- కుక్కకు పులి చారలను తలపించేలా రంగులు
- పులిలా తయారైన శునకం
కర్ణాటకలో ఓ రైతు తన తోటను కోతుల బారి నుంచి కాపాడుకునేందుకు వినూత్నమైన మార్గం ఎంచుకున్నాడు. నాలూరు గ్రామానికి చెందిన శ్రీకాంత్ గౌడ అనే రైతు తన పంటలను కోతులు నాశనం చేస్తుండడంతో తోటలో పులిబొమ్మ పెట్టాడు. అది నిజం పులే అనుకుని కోతులు ఆ తోటవైపు రావడం తగ్గించాయి. తనకున్న మరో తోటలోనూ ఇదేవిధంగా పులిబొమ్మ ఏర్పాటు చేశాడు. అక్కడ ఇదే ఫలితం కనిపించింది. కోతులు ఆ వైపు చూడడమే మానుకున్నాయి.
అయితే, కదలని పులిబొమ్మ కంటే కదిలే తన పెంపుడు కుక్కకు పులివేషం వేస్తే ఇంకెలా ఉంటుందో కదా అని ఆలోచించాడు. వెంటనే కుక్కకు పులిచారలను తలపించేలా రంగులు వేశాడు. దాంతో ఆ కుక్క చూడ్డానికి అచ్చం పులిలా తయారైంది. పెయింట్ కారణంగా కుక్క చర్మం పాడవుతుందనే ఉద్దేశంతో కొంతకాలం నుంచి దానికి హెయిర్ డైలు ఉపయోగించి రంగులు వేయడం మొదలుపెట్టాడు. ఇప్పుడా పులి కుక్క కనిపిస్తే చాలు కోతులు పరార్! ఇది చూసి గ్రామంలోని ఇతర రైతులు కూడా శ్రీకాంత్ గౌడలా కుక్కలకు రంగులు వేయాలని భావిస్తున్నారట!