Guntur District: ఆస్తి లాక్కుని అమ్మనే ఇంటి నుంచి గెంటేసిన కొడుకు!

  • పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు
  • అన్నం పెట్టి బాసటగా నిలిచిన సిబ్బంది
  • కొడుకుకు కౌన్సెలింగ్ ఇస్తామని స్పష్టీకరణ

అమ్మ మనసును అర్థం చేసుకుని ఆమెను పువ్వుల్లో పెట్టి చూసుకోవాల్సిన కొడుకు ఆస్తి లాక్కుని ఇంటి నుంచి గెంటేసి అమ్మను రోడ్డుపాలు చేశాడు. దిక్కులేని పరిస్థితుల్లో ఆ అసహాయురాలు పోలీసులను ఆశ్రయించి న్యాయం కోసం వేడుకుంది. వారు అన్నం పెట్టి ఆశ్రయం ఇచ్చారు.


వివరాల్లోకి వెళితే... గుంటూరు జిల్లా మాచర్లకు చెందిన దుర్గమ్మ (73)కు ఓ కొడుకు, కూతురు. భర్త చనిపోవడంతో కాయకష్టం చేసుకుంటూ బిడ్డల్ని పెంచింది. రోజు సంపాదనతోపాటు ప్రభుత్వం ఇచ్చే పింఛన్, ఇంటిపై వచ్చే అద్దె డబ్బులతోనే నెట్టుకువచ్చింది. వచ్చిన మొత్తాన్ని పిల్లల కోసమే ఖర్చుచేసింది. కొడుకు, కూతురు ఓ ఇంటివారు కావడంతో వారి పంచన తన జీవితం హాయిగా గడిచిపోతుందని కలలుగంది.

స్థిరాస్తి వ్యాపారం చేసే కొడుకు శ్రీనివాస్ మూడేళ్ల క్రితం హైదరాబాద్ లోని యూసుఫ్ గూడకు మకాం మార్చడంతో కొడుకుతోపాటు తాను వచ్చేసింది. మాచర్లలోని ఇంటిపై వచ్చే అద్దె డబ్బులతోపాటు, తనకు వచ్చే పింఛన్ మొత్తాన్ని కూడా కొడుకుకే ఇచ్చి వారి చెంతనే బతుకీడుస్తోంది. అయితే హైదరాబాదు మకాం మార్చే ముందు కొడుకు మాచర్లలోని ఇంటిని తనఖా పెట్టి డబ్బు ఇప్పించాలంటే అలాగే చేసింది.

ఇంటిని కుదువ పెట్టి కొడుకు రూ.6 లక్షలు తీసుకుంటే పుత్రవాత్సల్యంతో ఊరుకుంది. అన్నీ ఇచ్చిన తనను కొడుకు బాగా చూసుకుంటాడన్న ఆమె ఆశ నిజం కాలేదు. సొంతూరికి వెళ్లిపోతే బాగుంటుందన్న ఉద్దేశంతో మాచర్లలోని తన ఇంటిని విడిపించి ఇవ్వాలని కొడుకును కోరింది. దీంతో కోపోద్రిక్తుడైన శ్రీనివాస్ తల్లిని ఇంటి నుంచి వెళ్లగొట్టాడు.

 ఊహించని ఈ పరిణామంతో విస్తుపోయిన దుర్గమ్మ ఎటు వెళ్లాలో తెలియక హైదరాబాద్ లోని ఎస్.ఆర్.నగర్ పోలీసులను ఆశ్రయించింది. ఆమె పరిస్థితి చూసి జాలిపడిన ఏఎస్ఈ నిర్మలాదేవి భోజనం పెట్టి ఆమెను ఆదుకుంది. దుర్గమ్మ సమస్య విన్నామని, కొడుకు శ్రీనివాస్ ను పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహిస్తామని, ఆమెకు న్యాయం చేస్తామని పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News