Sabarimala: శబరిమలలోని హోటళ్లకు టీడీబీ హెచ్చరికలు!
- హోటళ్లలో ఆహారం నిల్వ ఉంచితే చర్యలు
- అధిక ధరలకు అమ్మితే లైసెన్స్ రద్దు
- టీడీబీ మీటింగ్ లో నిర్ణయాలు
నిత్యమూ లక్షలాది మంది అయ్యప్ప భక్తులు వెళుతున్న శబరిమలలో హోటళ్లకు ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు (టీడీబీ) కొన్ని హెచ్చరికలు జారీ చేసింది. తాజాగా, టీడీబీ బోర్డు మీటింగ్ జరుగగా, సన్నిధానం పరిసరాల్లో ఉన్న ప్రైవేటు హోటళ్లు, తమ వద్దకు వచ్చే వారికి తాజా ఆహారాన్ని అందించాలని, నిల్వ ఉంచిన ఆహార పదార్థాలను అందించినట్టు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
అన్ని ఆహార పదార్థాలనూ నిర్ణయించిన ధరల మేరకు మాత్రమే విక్రయించాలని, అధిక ధరలకు అమ్మితే, లైసెన్స్ లను రద్దు చేస్తామని పేర్కొంది. అన్ని హోటళ్లలో పని చేస్తున్న వారికి హెల్త్ కార్డులను తప్పనిసరి చేశామని టీడీబీ అధ్యక్షుడు వాసు తెలిపారు. భక్తులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని ఆయన అన్నారు.