Anu Dubey: పార్లమెంట్ ఎదుట ఒకే ఒక్క యువతి నిరసన... అరెస్ట్ చేసిన పోలీసులు!

  • ప్రియాంక హత్యాచారానికి నిరసనగా ధర్నా
  • బలవంతంగా లాక్కెళ్లిపోయిన పోలీసులు
  • ఆమెను స్టేషన్ లో కొట్టారన్న స్వాతీ మలివాల్

ఇండియాలో మహిళలకు రక్షణ కల్పించాలని కోరుతూ, పార్లమెంట్ ఎదుట ఒకే ఒక్క యువతి నిరసనకు దిగగా, పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి తరలించారు. నిరసనకు దిగిన యువతిని అనూ దూబేగా గుర్తించారు. ఆమె వయసు 24 సంవత్సరాలు. 'ఇండియాలో నేను సురక్షితమని ఎలా అనుకోవాలి' అని ప్రశ్నిస్తున్న ప్లకార్డును పట్టుకున్న ఆమె, పార్లమెంట్ 2-3 గేట్ ఎదురుగా ఉన్న పేవ్ మెంట్ పై కూర్చుని నినాదాలు చేసింది.

తొలుత ఆమెను జంతర్ మంతర్ వద్దకు వెళ్లి నిరసన తెలుపుకోవచ్చని, తక్షణమే ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని పోలీసులు హెచ్చరించారు. ఆమె నిరాకరించే సరికి పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ పోలీసులు, ఆమెను బలవంతంగా అక్కడి నుంచి తరలించారు. స్టేషన్ లో ఆమెను హెచ్చరించి వదిలేశామని ఓ అధికారి తెలిపారు. ఆపై మీడియాతో మాట్లాడిన దూబే, తాను ప్రభుత్వ పెద్దలతో మాట్లాడాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.

కాగా, పార్లమెంట్ ఎదుట నిరసన తెలుపుతున్న అనూ దూబేను పోలీసులు హింసించారని ఢిల్లీ కమిషన్ ఫర్ ఉమెన్ చైర్ పర్సన్ స్వాతీ మలివాల్ ఆరోపించారు. హైదరాబాద్ లో జరిగిన దారుణ హత్యాచారానికి వ్యతిరేకంగా అనూ నిరసన తెలిపిందని, ఆమె అరెస్ట్ విషయం తెలుసుకుని తాను స్టేషన్ కు వెళ్లానని, ఆ సమయంలో ఆమె ఎంతో భయంగా ఉందని వెల్లడించారు. ఆమెను స్టేషన్ లో కొట్టారని, ఇది పోలీసులకు సిగ్గుచేటని అన్నారు. తమపై వచ్చిన ఆరోపణలను పోలీసులు ఖండించారు. తాము అనూ దూబేపై చేయి చేసుకోలేదని ఓ అధికారి స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News