Andhra Pradesh: ఏపీలో మంత్రులకు స్వేచ్ఛ లేదు.. అంతా జగన్ మయం: సీపీఐ కార్యదర్శి రామకృష్ణ
- ఏపీలో ఏకపక్ష పాలన సాగుతోంది
- జగన్ ఆరు నెలల పాలన మిశ్రమ ఫలితాలే మిగిల్చింది
- జగన్ ప్రభుత్వం ప్రతిపక్షాలను ఖాతరు చేయడం లేదు
‘నవరత్నాలు’ అమలుకు పూర్తిగా కాకపోయినా కొంత మేరకు కృషి జరిగిందని సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, మంత్రి వర్గ కూర్పులో సామాజిక న్యాయం, గ్రామ సచివాలయ, వాలంటీర్లు అంటూ కొత్త ఉద్యోగాలు ఇచ్చారని ప్రశంసించారు. అదేసమయంలో జగన్ పాలనపై ఆయన విమర్శలు కూడా చేశారు.
కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల్లో అభద్రతాభావం నెలకొందని, ఇప్పటికే కొంతమంది ఉద్యోగాలు కోల్పోయారని, ఐదు నెలల పాటు ఇసుక సరఫరా ఆపేయడంతో ముప్పై లక్షల మంది ఉపాధి కోల్పోయారని అన్నారు. అన్న క్యాంటీన్ల మూసివేతతో నిరుపేదలు, దినసరి కూలీలు ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు.
మంత్రులకు స్వేచ్చగా నిర్ణయాలు తీసుకునే అధికారం లేదని, అంతా జగన్ మయం అయిపోయిందని విమర్శించారు. ఏపీలో ఏకపక్షంగా, ఏక వ్యక్తి పాలన సాగుతోందని, జగన్ ఆరు నెలల పాలన మిశ్రమ ఫలితాలనే మిగిల్చిందని అభిప్రాయపడ్డారు. జగన్ ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీలను ఖాతరు చేయడం లేదని విమర్శించారు.