Amaravathi: అమరావతి ఘటన.. పోలీసుల పాత్రపై వారం రోజుల్లోగా నివేదిక అందజేస్తాం : ఐజీ వినీత్ బ్రిజ్ లాల్
- బస్సుపై లాఠీ విసిరారన్న ప్రచారంలో వాస్తవం లేదు
- పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించి వుంటే చర్యలు తప్పవు
- చంద్రబాబు ప్రయాణించిన బస్సును సీజ్ చేశాం
ఏపీ రాజధాని అమరావతిలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఇటీవల పర్యటించిన విషయం తెలిసిందే. ఈ పర్యటనలో తలెత్తిన ఘటనపై ఐజీ వినీత్ బ్రిజ్ లాల్ స్పందించారు. ఆరోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు పర్యటించేందుకు అనుమతి తీసుకున్నారని, పది గంటలకు కరకట్ట నుంచి చంద్రబాబు పర్యటన ప్రారంభమైందని చెప్పారు.
ఉదయం 10.17 గంటలకు సీడ్ యాక్సెస్ రోడ్డు వద్దకు కాన్వాయ్ చేరుకుందని, నిరసనకారులు బస్సు పైకి చిన్నరాయి, ఓ చెప్పు విసిరారని, లాఠీ విసిరారని జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని చెప్పారు. బస్సుపై దాడికి పాల్పడిన వారిపై 352, 290,188 సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని తెలిపారు. పోలీసులు తమ విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించి వుంటే చర్యలు తీసుకుంటామని, ఈ ఘటనకు సంబంధించి పోలీసుల పాత్రపై వారం రోజుల్లోగా నివేదిక అందజేస్తామని స్పష్టం చేశారు.
ఈ కేసు దర్యాప్తులో భాగంగా చంద్రబాబు ప్రయాణించిన బస్సును సీజ్ చేశామని, బస్సు అద్దం కొంత మేరకు ముందుభాగంలో పగిలిందని అన్నారు.