Tsrtc: ఆర్టీసీ కార్మికులపై సీఎం కేసీఆర్ వరాల జల్లు!
- ఆర్టీసీ కార్మికులతో కేసీఆర్ సమావేశం
- వారితో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన కేసీఆర్
- కార్మికుల రిటైర్మెంట్ వయో పరిమితి 60 ఏళ్లకు పెంపు
రాష్ట్రంలోని మొత్తం 97 డిపోలకు చెందిన ఆర్టీసీ కార్మికులతో ఈ రోజు ప్రగతి భవన్ లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమయ్యారు. ప్రతి డిపో నుంచి ఐదుగురు కార్మికులను ఈ సమావేశానికి ఆహ్వానించారు. కార్మికులతో కేసీఆర్ మధ్యాహ్న భోజనం చేశారు. అనంతరం కూడా కార్మికులతో నేరుగా మాట్లాడారు. ఆర్టీసీ మనుగడ కోసం కష్టించి పనిచేయాలని కార్మికులకు సూచించినట్టు సమాచారం. ఈ సందర్భంగా కార్మికులకు పలు హామీలు ఇచ్చినట్టు తెలుస్తోంది.
ఆర్టీసీ కార్మికుల రిటైర్మెంట్ వయోపరిమితిని 60 ఏళ్లకు పెంచుతామని, ఆర్టీసీని లాభాల్లోకి తీసుకొస్తే సింగరేణి తరహా బోనస్ ఇస్తామని, 52 రోజుల పాటు చేసిన సమ్మె కాలానికి సంబంధించి కార్మికులకు జీతాలు చెల్లిస్తామని, మహిళా ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. మహిళల కోసం డిపోల్లో ప్రత్యేక వసతులు ఏర్పాటు చేయాలని, సమ్మె కాలానికి సంబంధించిన జీతాలను కార్మికులకు రేపు చెల్లించాలని, బస్సులో ప్రయాణికులు టికెట్ తీసుకోకపోతే కండక్టరుకు మాత్రమే విధిస్తున్న పెనాల్టీని ఇకపై ప్రయాణికులకూ విధించాలని నిర్ణయించినట్టు సమాచారం.