Tamil Nadu: తమిళనాడులో ఘోరం.. వర్షాల కారణంగా కూలిన నాలుగు భవనాలు.. 15 మంది మృతి
- కోయంబత్తూరులోని మెట్టుపాళ్యంలో ఘటన
- భారీ వర్షాల కారణంగా కూలిన ఇళ్లు
- శిథిలాల కింద మరికొందరు
తమిళనాడులో నాలుగు భవనాలు కూలిన ఘటనలో 15 మంది మృతి చెందారు. కోయంబత్తూరు మెట్టుపాళ్యంలో జరిగిందీ ఘటన. తమిళనాడులో గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఈ భవనాలు ఒక్కసారిగా కుప్పకూలినట్టు తెలుస్తోంది. ప్రమాద సమయంలో 15 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, శిథిలాల కింద మరికొందరు చిక్కుకుని ఉంటారని భావిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక కార్యక్రమాలు చేపట్టారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
మరోవైపు, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానల కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. వర్షాలు మరో రెండు రోజులు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. వర్షాల కారణంగా చాలా జిల్లాల్లో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. నివాస ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకోవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు.