Telangana: మా మంచి సీఎం కేసీఆర్... వరాల వర్షంతో ఉబ్బితబ్బిబ్బవుతున్న ఆర్టీసీ కార్మికులు!

  • నిన్న ఆర్టీసీ కార్మికులతో కేసీఆర్ సమావేశం
  • పలు కీలక నిర్ణయాలు వెలువరించిన సీఎం
  • ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న కార్మికులు

నిన్న ఆర్టీసీ కార్మికులతో సమావేశమైన వేళ, తెలంగాణ ముఖ్యమంత్రి వరాల వర్షాన్ని కురిపించగా, కార్మికులంతా తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, ఇంత మంచి ముఖ్యమంత్రి తెలంగాణకు ఉండటం అదృష్టమని అంటున్నారు. సీఎం ప్రసంగంతో వారి సంతోషానికి అవధులు లేకుండా పోగా, బయటకు వచ్చిన తరువాత, తమ ఆనందాన్ని మీడియా ముందు పంచుకున్నారు.

పదవీ విరమణ వయసు పెంపు తమకు ఎంతో మేలును కలిగిస్తుందని, సెప్టెంబర్ నెల వేతనాలు నేడు అందుతాయని అనుకుంటేనే ఎంతో సంతోషం వేస్తోందని, సమ్మె కాలానికి వేతనం కూడా ఇస్తామనడం, కేసీఆర్ మంచి తనానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. ఇక బస్సులో ఎవరైనా టికెట్ తీసుకోకుండా తనిఖీ అధికారులకు పట్టుబడితే, కండక్టర్ పై చర్యలు ఉండవంటూ కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని ఆర్టీసీ కార్మికులు స్వాగతించారు.

 ఏటా ఆర్టీసీకి రూ. 1000 కోట్లు ఇస్తామని చెప్పడం సంస్థ అభివృద్ధికి దోహదపడుతుందని, సమ్మె కాలంలో మరణించిన కార్మికులకు నష్టపరిహారంతో పాటు, వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని వెల్లడించిన కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. స్నేహితులు, బంధుమిత్రులతో కలిసి మిఠాయిలు పంచుకుని, తమ ఆనందాన్ని వారు వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News