Jaya Bachchan: మూకదాడి చేసి చంపేయాలి: లోక్ సభలో నిప్పులు చెరిగిన జయా బచ్చన్!
- రాజ్యసభను కుదిపేసిన దిశ హత్యాచారం
- తీవ్ర ఆగ్రహంతో మాట్లాడిన ఎంపీలు
- ప్రభుత్వం సమాధానం చెప్పాలన్న జయాబచ్చన్
హైదరాబాద్ శివార్లలో జరిగిన దారుణ హత్యాచార ఘటన నేడు రాజ్య సభను కుదిపేసింది. దేశంలో మహిళలు, చిన్నారుల భద్రతపై ప్రత్యేక చర్చ జరుగగా, సమాజ్ వాదీ పార్టీ సభ్యురాలు జయా బచ్చన్, తీవ్ర ఆగ్రహంతో మాట్లాడారు. "ఇటువంటి కామాంధులను ప్రజలకు అప్పగించాలి. అప్పుడు ప్రజలే వారిపై మూకదాడి చేసి చంపేస్తారు. జరుగుతున్న ఘోరాలపై ప్రభుత్వం సరైన సమాధానం చెప్పాల్సిన సమయం వచ్చింది. ప్రజలు కూడా ఇదే కోరుకుంటున్నారు" అని ఆమె అన్నారు.
కాగా, గత బుధవారం నాడు 26 ఏళ్ల దిశ (వెటర్నరీ డాక్టర్)ను ట్రాప్ చేసిన నలుగురు యువకులు, ఆమెను దారుణంగా రేప్ చేసి, చంపేసి, పెట్రోల్ పోసి తగులబెట్టిన సంగతి తెలిసిందే. ఈ ఘటన దేశవ్యాప్తంగా మరో 'నిర్భయ'ను గుర్తుకు తెచ్చింది. దేశం యావత్తూ దిశ కుటుంబానికి న్యాయం చేయాలని నినదిస్తోంది.
జయా బచ్చన్ అనంతరం, అన్నా డీఎంకే ఎంపీ విజిలా సత్యనాథ్ మాట్లాడుతూ, కన్నీరు పెట్టుకున్నారు. భారతావని మహిళలకు, చిన్నారులకు క్షేమకరంగా లేదని అన్నారు. ఎంతటి కఠిన నేరాలు చేసినా, నిందితులకు శిక్ష పడటం లేదని, వారిని జైళ్లలో పెంచి పోషిస్తున్నారని ఆరోపించారు.