Maharashtra: ఆ నిధుల్ని దుర్వినియోగం నుంచి కాపాడడానికే ఫడ్నవీస్ ముఖ్యమంత్రి అయ్యారు!: కేంద్ర మంత్రి అనంతకుమార్ వెల్లడి

  • మెజార్టీ లేదని మాకు తెలుసుకదా 
  • ఓ పని కోసం ఆ డ్రామా ఆడించారు అంతే 
  • 15 గంటల్లో రూ.40 వేల కోట్లను కేంద్రానికి తిప్పి పంపారు

మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వమా...అబ్బే అదేం లేదండీ... మెజార్టీ లేదని మాకు తెలియదా...అంతా ఉత్తుత్తినే...ఈ మాటలు అన్నది ఎవరో కాదు!. ఆ పార్టీ ఎంపీ, కేంద్రమంత్రి అనంతకుమార్ హెగ్డే. ఓ బృహత్తర కార్యక్రమం కోసం మాత్రమే ఫడ్నవీస్ 80 గంటలపాటు ముఖ్యమంత్రిగా ఉన్నారని సదరు మంత్రి చెప్పుకొచ్చారు. 

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదలైనప్పటి నుంచి రాజకీయంగా ఎన్నో ఆసక్తికర అంశాలు తెరపై చూశాం. రాష్ట్రంలో శివ సేన ఆధ్వర్యంలో కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది. పరిస్థితి అంతా సద్దుమణిగిందనుకునే సమయంలో కర్ణాటకలో నిన్న జరిగిన ఓ సభలో మంత్రి ఈ ఆసక్తికర వ్యాఖ్య చేసి మళ్లీ రాజకీయ వర్గాల్లో చర్చకు తెరలేపారు.

ఇంతకీ ఆయన ఏమన్నారంటే... 'మహా వికాస్ అఘాడీ' ప్రభుత్వం ఏర్పాటుకు అంతా సిద్ధమైందని మాకు తెలుసు. కానీ ఆ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అప్పటికే రాష్ట్రానికి కేంద్రం కేటాయించిన రూ.40 వేల కోట్ల నిధులు దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉందని మా దృష్టికి వచ్చింది. ఈ నిధులను కాపాడాలన్నదే ఫడ్నవీస్ ఉద్దేశం. అందుకే ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అధికారంలోకి వచ్చిన 80 గంటల్లోనే ఆ 40 వేల కోట్ల రూపాయలను తిరిగి కేంద్రానికి బదలాయించారు' అంటూ చెప్పుకొచ్చారు.

శివ సేన ప్రభుత్వం ఏర్పాటుకు ముహూర్తం ఖరారై ఉదయం ప్రమాణ స్వీకారం జరుగుతుందన్న సమయంలో ఎన్సీపీలో చీలిక తెచ్చి ఆ పార్టీ నేత అజిత్ పవార్ తో కలిసి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా, అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

అయితే బలనిరూపణకు కోర్టు విధించిన గడువు ముందే ఫడ్నవీస్ రాజీనామా చేశారు. ఆ సందర్భంలో ఆయన మాట్లాడుతూ ఎన్సీపీ ఎమ్మెల్యేలంతా తనతో ఉన్నారని అజిత్ పవార్ చెప్పడం వల్లే తాము ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లు చెప్పిన విషయం తెలిసిందే. ఇందుకు భిన్నంగా అనంతకుమార్ కొత్త కథ వినిపిస్తుండడం గమనార్హం.

  • Loading...

More Telugu News