Disha: కేసు నమోదుకు దిశ కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సి వచ్చింది: లోక్ సభలో ఉత్తమ్ కుమార్
- జాతీయ రహదారుల వద్ద మద్యం అమ్మకూడదు
- భద్రత అధికంగా ఉండే ప్రాంతంలోనే ఈ ఘటన జరిగింది
- తెలంగాణ మద్యం పాలసీ బాగోలేదు
దిశను అత్యంత కిరాతకంగా హత్య చేశారని లోక్ సభలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. దిశ ఘటనపై లోక్ సభలో చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ... హైదరాబాద్ కు కూతవేటు దూరంలో దిశ హత్య జరిగిందని అన్నారు. కేసు నమోదుకు బాధితురాలి కుటుంబ సభ్యులు పలు పోలీస్ స్టేషన్లు తిరగాల్సి వచ్చిందని చెప్పారు. మొదట వారు ఓ పోలీస్ స్టేషన్ కు వెళితే మరో స్టేషన్ కు వెళ్లాలని చెప్పారని తెలిపారు.
మొదటి స్టేషన్ లోనే వారు కేసు నమోదు చేసుకొని ఉంటే, ఆ అమ్మాయి ప్రాణాలు దక్కేవని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. జాతీయ రహదారుల వద్ద మద్యం అమ్మకూడదని నిబంధనలు ఉన్నాయని చెప్పారు. భద్రత అధికంగా ఉండే ప్రాంతంలోనే ఈ ఘటన జరిగిందని అన్నారు. తెలంగాణ మద్యం పాలసీ బాగోలేదని చెప్పారు. ఈ కారణాల వల్లే ఇటువంటి ఘటన చోటు చేసుకుందని అన్నారు. ఈ ఘటనపై తెలంగాణ మంత్రులు చేసిన వ్యాఖ్యలు సరికావని విమర్శించారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు.