KARVEY: కార్వీపై ఎన్ఎస్ఈ వేటు.. ట్రేడింగ్ లైసెన్స్ సస్పెన్షన్
- సెబీ మార్గదర్శకాలు పాటించనందునే అని వెల్లడి
- అన్ని విభాగాలకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని స్పష్టీకరణ
- సెక్యూరిటీలను దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు
ఖాతాదారుల సెక్యూరిటీలను దుర్వినియోగం చేస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ కార్వీపై జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఈ) వేటు వేసింది. సెబీ మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. సంస్థ ట్రేడింగ్ లైసెన్స్ ను సస్పెండ్ చేస్తూ, ఇది అన్ని విభాగాలకు వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఖాతాదారుల సెక్యూరిటీలను ఈ బ్రోకరేజీ సంస్థ ఇతరత్రా అవసరాలకు వినియోగించి దుర్వినియోగం చేసినట్టు నవంబరు 22న సెబీ గుర్తించింది.
ముఖ్యంగా 1096 కోట్ల రూపాయలను తన గ్రూప్ కంపెనీ కార్వీ రియాల్టీకి 2016, ఏప్రిల్ నుంచి 2019 అక్టోబరు మధ్య బదిలీ చేసిందని గుర్తించింది. తొమ్మిది మంది క్లయింట్లకు చెందిన రూ.485 కోట్ల అదనపు సెక్యూరిటీలను విక్రయించినట్లు, ఆరుగురి క్లయింట్ల రూ.162 కోట్ల విలువైన సెక్యూరిటీలను బదిలీ చేసినట్లు గుర్తించారు.
ఇలా పలు అంశాల్లో అవకతవకలకు పాల్పడినట్లు గుర్తించడంతో సంస్థ లైసెన్స్ ను సస్పెండ్ చేయడమేకాక కొత్త ఖాతాదారులను తీసుకోకుండా, ఇప్పటికే ఉన్న ఖాతాదారుల పవర్ ఆఫ్ అటార్నీని వినియోగించకుండా ఆంక్షలు విధించింది. ఎక్స్చేంజిలు సంస్థపై చర్యలు తీసుకోవాలని కూడా సూచించింది.