udaya bhanu: ఆ ఘటన తలుచుకుంటేనే అర్ధరాత్రి ఉలిక్కిపడి నిద్రలేస్తున్నాను: ఉదయ భాను ఆవేదన
- బాధితురాలి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ కు వెళ్లారు
- అమ్మాయి బాయ్ ఫ్రెండ్ తో వెళ్లి ఉండొచ్చు అని అన్నారట
- దిశ ఎంతటి నరకాన్ని అనుభవించిందో
- ఎందుకీ దేశంలో పుట్టానురా బాబు? అని కన్నీరు పెట్టుకోవాల్సి వస్తోంది
ఇటీవల జరిగిన దిశ ఘటనను తలుచుకుంటే అర్ధరాత్రి సమయంలోనూ ఉలిక్కిపడి నిద్రలేస్తున్నానని యాంకర్ ఉదయభాను అన్నారు. టీవీ9కి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ... 'సమాజంలో మార్పు కోసం ఎంత కాలం ఎదురుచూడాలి? చిన్న పిల్లలకు ఆటలు నేర్పించాలా? లేక పోతే బ్యాడ్ టచ్, గుడ్ టచ్ నేర్పించాలా? ప్రతి తల్లిదండ్రులు తమ అమ్మాయిల గురించి ఆందోళన చెందుతున్నారు' అని అన్నారు.
'బాధితురాలి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ కు వెళితే బాయ్ ఫ్రెండ్ తో వెళ్లి ఉండొచ్చు.. పోయి పని చూసుకో అన్నారట. దీనిపై ఎలా స్పందించాలి? పోలీసులసు సస్పెండ్ చేస్తారు, మళ్లీ నాలుగు రోజుల తర్వాత ఉద్యోగాలు ఇచ్చేస్తారు. వారిని.. సస్పెండ్ చేస్తే సరిపోతుందా? అక్కడ అమ్మాయి ప్రాణం పోయింది. అమ్మాయిని కాల్చి చంపితే ఇప్పుడు ప్రతి స్పందిస్తున్నాం. కానీ, ప్రతిరోజు ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి' అని ఉదయ భాను ఆవేదన వ్యక్తం చేశారు.
'అత్యాచారం చేసి ఆడపిల్లల తలలు తీసేస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయి. ఘటన జరిగినప్పుడు స్పందిస్తున్నాం తర్వాత మర్చిపోతున్నాం. మళ్లీ కొత్త ఘటన జరుగుతుంది. ఎందుకీ దేశంలో పుట్టానురా బాబు? అని కన్నీరు పెట్టుకోవాల్సి వస్తోంది. ఎప్పుడు ఏ అమ్మాయికి ఏమవుతుందో తెలియకుంది. ఈ ఘటన తలుచుకుంటుంటే అర్ధరాత్రి ఉలిక్కిపడి లేస్తున్నాను. పశువుల మధ్య బతుకుతున్నాం' అని ఉదయభాను వ్యాఖ్యానించారు.
'దిశ ఎంతటి నరకాన్ని అనుభవించాల్సి వచ్చిందో తలుచుకుంటేనే ఉలికిపడాల్సిన వస్తోంది. నేనెప్పుడూ దేవుడి దగ్గర కూర్చొని ఏ కోరిక కోరను. కానీ, ఇప్పుడు ప్రపంచంలో ఏ అమ్మాయికీ ఏమీ కాకుండా చూడు భగవంతుడా అని నేను కోరుకుంటున్నాను. అసలు దేవుడు ఉన్నాడో లేడో నాకు తెలియదు' అని ఉదయ భాను వ్యాఖ్యానించారు.