Ram Mohan Naidu: ఆ భయం ఆమెకు మాత్రమే పరిమితమైంది కాదు: రామ్మోహన్ నాయుడు
- నిర్భయ ఘటన తర్వాత కూడా అత్యాచారాలు తగ్గలేదు
- దుర్మార్గులకు మరణశిక్ష ఒక్కటే సరైనది
- కఠిన శిక్షలు పడేలా చట్టాలు తీసుకురావాలి
శంషాబాద్ మండలం తొండుపల్లి టోల్ గేట్ వద్ద వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటన పార్లమెంటును కుదిపేస్తోంది. ఉభయసభల్లో ఈ ఘటనపై చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు లోక్ సభలో మాట్లాడుతూ, ఈ దారుణ ఘటన సంభవించడానికి ముందు దిశ తన సోదరికి ఫోన్ చేసిందని... ఎంతో భయంతో మాట్లాడిందని చెప్పారు. ఆ భయం కేవలం ఆమెకు మాత్రమే పరిమితం కాదని... దేశంలోని ప్రతి తల్లి, ప్రతి చెల్లి భయపడుతూనే బతుకుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి దారుణాలకు ఒడిగట్టే దుర్మార్గులకు మరణశిక్ష ఒక్కటే సరైనదని అన్నారు.
నిర్భయ ఘటన తర్వాత కూడా అమ్మాయిలు, మహిళలపై అత్యాచారాలు తగ్గలేదని రామ్మోహన్ నాయుడు తెలిపారు. అత్యాచారాలకు పాల్పడేవారికి కఠిన శిక్షలు పడేలా చట్టాలను తేవాలని అన్నారు. పాఠశాల స్థాయి నుంచే మహిళల భద్రతపై చిన్నారుల్లో అవగాహన కల్పించాలని అభిప్రాయపడ్డారు.