Revanth Reddy: మగాళ్లందరినీ ఇళ్లలో పెట్టి తాళం వేస్తే ఆడవాళ్లకు ప్రమాదం ఉండదు కదా!: సీఎం కేసీఆర్ పై సెటైర్ వేసిన రేవంత్ రెడ్డి
- ఆర్టీసీ మహిళా కార్మికులకు రాత్రిపూట విధులు వద్దన్న కేసీఆర్!
- స్పందించిన రేవంత్ రెడ్డి
- సీఎంలో మార్పు వస్తే శాంతిభద్రతలు సవ్యంగా ఉంటాయని వ్యాఖ్యలు
దిశ ఘటన నేపథ్యంలో ఆర్టీసీ మహిళా కార్మికులకు రాత్రివేళల్లో 8 గంటలకే విధులు ముగిసేలా చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ పేర్కొనడాన్ని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. తెలంగాణలో ముఖ్యమంత్రి వైఖరి ఎలా ఉందో అధికారుల వైఖరి కూడా అలాగే ఉందని విమర్శించారు. పోలీసులను, నిఘా విభాగాలను రాజకీయ క్రీడల కోసం ఉపయోగించుకుంటుండడంతో వాళ్లు తమ నిజమైన విధి నిర్వహణ చేయలేకపోతున్నారని అన్నారు. సీఎంలో మార్పు వచ్చినప్పుడే శాంతిభద్రతలు కూడా సవ్యరీతిలో ఉంటాయని తెలిపారు.
"ముఖ్యమంత్రిగారు ఆర్టీసీ మహిళా కార్మికులకు మాత్రమే రాత్రి 8 గంటల వరకు డ్యూటీలు అని చెబుతున్నారు. ఐటీ రంగంలో మహిళలు లేరా? వాళ్లకు 24 గంటలు విధులు ఉంటాయి. మరి వాళ్ల సంగతేంటి? నీ చేతగానితనాన్ని మహిళలపై పరోక్షంగా రుద్దుతూ 8 గంటలకే ఇళ్లకుపోండి అని చెబుతున్నారు. ఇలాంటి ఆలోచనలు చేసేవాళ్లను మొదట జైల్లో పెట్టాలి.
దీనికి ఇంకో పరిష్కారం కూడా ఉంది. మగాళ్లందరూ రాత్రి 8 గంటలకే ఇళ్లకు వెళ్లిపోతే ఆడవాళ్లకు ఎలాంటి ప్రమాదం ఉండదు. ఆడవాళ్లే ఇంట్లో ఉండడం ఎందుకు... మగాళ్లందరినీ రాత్రి 8 గంటలకే ఇళ్లలో పెట్టి తాళం వేస్తే సరి... ఆడవాళ్లు స్వేచ్ఛగా తిరగొచ్చు కదా! ఇలాంటి తలాతోకా లేని ప్రకటనలు, సలహాల కారణంగా మహిళల్లో మరింత అభద్రతా భావం పెరుగుతుంది" అంటూ రేవంత్ వ్యాఖ్యానించారు.