Chandrababu: చంద్రబాబుపైకి పోలీసు లాఠీ ఎవరు విసిరారో సిట్ విచారణలో తేల్చాలి: అచ్చెన్నాయుడు
- పథకం ప్రకారమే దాడి చేశారన్న అచ్చెన్న
- సీఎం పర్యటనలో నిరసనలకు తమకూ అనుమతి ఇవ్వాలని డిమాండ్
- వైసీపీ మినహా అన్ని పార్టీలతో రౌండ్ టేబుల్ సమావేశం
మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు వైసీపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. అమరావతి పర్యటనలో చంద్రబాబు బస్సుపై దాడి పథకం ప్రకారం ముందే అనుకుని చేశారని ఆరోపించారు. దాడిపై కేంద్రానికి ఫిర్యాదు చేయగానే సిట్ వేశారని విమర్శించారు. చంద్రబాబుపైకి పోలీసు లాఠీ ఎవరు విసిరారో సిట్ విచారణలో తేల్చాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు పర్యటనలో నిరసనలు తెలిపేందుకు అనుమతిచ్చిన పోలీసులు, సీఎం శ్రీకాకుళం పర్యటనలో నిరసన తెలిపేందుకు తమకూ అవకాశం ఇవ్వాలని అచ్చెన్నాయుడు నిలదీశారు.
రాజధానిపై సీఎం, మంత్రులు ఇష్టంవచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాజధాని కోసం తాము ఐదేళ్ల సమయం వృథా చేశామని అంటున్నారని, వాస్తవానికి రాజధాని పనులు మొదలైంది రెండేళ్ల క్రితమేనని స్పష్టం చేశారు. అన్ని వర్గాల నిపుణులు, మేధావులను రౌండ్ టేబుల్ సమావేశానికి ఆహ్వానిస్తున్నామని, డిసెంబరు 5న జరిగే ఈ సమావేశానికి వైసీపీ మినహా అన్ని పార్టీలను పిలుస్తున్నామని అచ్చెన్నాయుడు చెప్పారు.