TTD: టీటీడీలో ఉద్యోగం ఇప్పిస్తానని బంధువుకే రూ.12 లక్షల టోకరా వేసిన ఘనుడు!
- నాలుగు విడతలుగా రూ. 12 లక్షలు చెల్లించుకున్న బాధితుడు
- డబ్బులు అడిగితే బెదిరింపులు
- పోలీసులకు ఫిర్యాదు
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో ఉద్యోగం ఇప్పిస్తానని రూ.12 లక్షలు వసూలు చేసి మోసం చేసిన వ్యక్తిపై గుంటూరు జిల్లాలో కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం.. మంగళగిరి మండలం యర్రబాలెంకు చెందిన వేళంగిణి రాజు, కొల్లిపర మండలం దావులూరుకు చెందిన అంబటి శేషగిరిరావు దగ్గరి బంధువులు. తనకు టీటీడీలో ఉన్నతస్థాయిలోని ఉద్యోగులు తెలుసని, రూ.12 లక్షలు ఇస్తే ఉద్యోగం ఇప్పిస్తానంటూ శేషగిరిరావుతో వేళంగిణి రాజు చెప్పాడు.
నిజమేనని నమ్మిన శేషగిరిరావు నాలుగు విడతలుగా రూ.12 లక్షలు చెల్లించాడు. అయితే, ఆ తర్వాత ఉద్యోగం గురించి మాట్లాడకపోవడంతో తన డబ్బులు తనకు వెనక్కి ఇవ్వాలని శేషగిరిరావు ఒత్తిడి తీసుకొచ్చాడు. దీంతో విషయం పెద్దమనుషుల వద్దకు చేరింది. అక్కడ 7 లక్షల రూపాయలు ఇస్తానని వేళంగిణి రాజు ఒప్పుకున్నాడు. పెద్ద మనుషుల వద్ద డబ్బులు ఇస్తానని చెప్పినప్పటికీ ఇవ్వకపోగా, తిరిగి బెదిరిస్తుండడంతో శేషగిరిరావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.