pankaja munde: బీజేపీకి పంకజ్ ముండే ఝలక్.. ట్విట్టర్ ఖాతా నుంచి బీజేపీ, రాజకీయ ప్రస్తావన తొలగింపు
- రేపటి మార్గాన్ని సరిచూసుకోవాల్సి ఉందంటూ ట్వీట్
- బీజేపీని వీడబోతున్నారంటూ ప్రచారం
- లేదని స్పష్టం చేసిన మహా బీజేపీ చీఫ్
మహారాష్ట్ర బీజేపీ నేత పంకజ్ ముండే సొంత పార్టీకి ఝలక్ ఇచ్చారు. తన వ్యక్తిగత ట్విట్టర్ ఖాతా నుంచి బీజేపీ, రాజకీయ ప్రస్తావనను తొలగించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఉద్ధవ్ థాకరేకు అభినందనలు తెలిపారు. దీంతో ఆమె పార్టీ మారబోతున్నారంటూ ఒక్కసారిగా ఊహాగానాలు వెల్లువెత్తాయి. అంతేకాదు, మారిన పరిస్థితుల్లో రేపటి మార్గాన్ని సరిచూసుకోవాల్సి ఉందని చెప్పడం మరిన్ని అనుమానాలకు తావిచ్చింది. ఆమె ట్వీట్లపై బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ స్పందించారు. పంకజ్ ముండే పార్టీని వీడడం లేదని స్పష్టం చేశారు.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీడ్ జిల్లాలోని పార్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన పంకజ్ ముండే తన పెదనాన్న కొడుకు, ఎన్సీపీ అభ్యర్థి ధనుంజయ్ ముండే చేతిలో పరాజయం పాలయ్యారు. పంకజ్ ముండే తండ్రి గోపీనాథ్ ముండే 2014లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో గెలిచిన పంకజ్కు ‘మహా’ కేబినెట్లో చోటు లభించింది.