Hyderabad: వీడిన యువతి అదృశ్యం మిస్టరీ.. గుంటూరులో యువతీయువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
- ఫొటోలు చూపించి కుటుంబాన్ని బయటపడేస్తానని బెదిరింపు
- తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లానన్న యువతి
- గుంటూరులో పెళ్లికి ఏర్పాట్లు చేశాడన్న బాధితురాలు
హైదరాబాద్, హిమాయత్‌నగర్‌లోని హాస్టల్ నుంచి యువతి అదృశ్యమైన కేసును పోలీసులు ఛేదించారు. ట్యాంక్‌బండ్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ ఆమె లేఖ రాసి వెళ్లిపోయిన సంగతి విదితమే. ఆమె కోసం గాలించిన పోలీసులు ఎట్టకేలకు గుంటూరులో యువతీయువకులను అదుపులోకి తీసుకుని నగరానికి తీసుకొచ్చారు.
పోలీసుల కథనం ప్రకారం.. నిజామాబాద్ జిల్లా నవీపేటకు చెందిన యువతీయువకులకు చిన్నప్పటి నుంచే పరిచయం ఉంది. ఆ తర్వాత ఇద్దరూ ప్రేమించుకున్నారు. ఆ సందర్భంగా కొన్ని ఫొటోలు దిగారు. అనంతరం విడిపోయారు. ఇంజినీరింగ్ చేసేందుకు యువతి హైదరాబాద్ వచ్చి హిమాయత్‌నగర్ హాస్టల్లో ఉంటోంది. హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చేసేందుకు నగరానికి వచ్చిన యువకుడు.. ఆమె కూడా ఇక్కడే ఉందని తెలుసుకుని ఫోన్లు చేయడం మొదలుపెట్టాడు.
అయితే, ఆమె నిరాకరించడంతో హాస్టల్‌కు వచ్చి పెట్రోలు పోసి తగలబెడతానని, తాను ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. ఫోన్ నంబరు మార్చినా వేధించడం మానలేదు. తన వద్దనున్న ఫొటోలు వైరల్ చేస్తే కుటుంబం మొత్తం వీధినపడుతుందని బెదిరించాడని, దీంతో తాను చనిపోవాలని నిర్ణయించుకున్నట్టు యువతి పోలీసులకు తెలిపింది. ఈ కారణంగానే తాను లేఖ రాసి హాస్టల్ నుంచి బయటకు వచ్చినట్టు చెప్పింది.
ట్యాంక్‌బండ్ నుంచి దూకే క్రమంలో అక్కడున్నవారు తనను అడ్డుకున్నారని, దీంతో బేగంపేటలో ఉండే యువకుడి గదికి వెళ్లానని తెలిపింది. అక్కడ అతడి ఫోన్లో ఉన్న ఫొటోలు డిలీట్ చేశానని, అయితే, మరో ఫోన్లోనూ ఉన్నాయని, తనను పెళ్లాడకుంటే చనిపోతానంటూ బ్లేడుతో చేయి కోసుకున్నాడని, గదిలో ఉన్న ఓ రసాయనం తాగేశాడని చెప్పింది. దీంతో మరో దారిలేక అతడితో కలిసి గుంటూరు వెళ్లాల్సి వచ్చిందని, అక్కడ అతడు పెళ్లికి ఏర్పాట్లు చేశాడని వివరించింది.
మరోవైపు, యువతి తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువకుడి ఫోన్ లొకేషన్ ఆధారంగా వారు గుంటూరులో ఉన్నట్టు నిర్ధారించుకుని, అక్కడికి వెళ్లి ఇద్దరినీ అదుపులోకి తీసుకుని నగరానికి తీసుకొచ్చారు.