Akbaruddin Owaisi: బాబ్రీ మసీదును కూల్చివేసిన వారందరినీ జైలుకు పంపించండి: అక్బరుద్దీని ఒవైసీ
- కూల్చివేత ఘటనపై త్వరితగతిన విచారణ జరపాలి
- మసీదుకు మరో చోట స్థలం ఇవ్వడం మాకు ఆమోదయోగ్యం కాదు
- డిసెంబర్ 6న శాంతియుత పద్ధతిలో నిరసనలు తెలపాలి
ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయోధ్యలోని బాబ్రీ మసీదును కూల్చివేసిన వారందరినీ జైలుకు పంపించాలని డిమాండ్ చేశారు. మసీదు కూల్చివేత ఘటనపై త్వరితగతిన విచారణ జరిపి, చర్యలు తీసుకోవాలని కోరారు. అయోధ్య స్థల వివాదం అంశంపై సుప్రీంకోర్టు తీర్పులు సమీక్షించాలని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. డిసెంబర్ 6న బాబ్రీ మసీదు కూల్చివేత రోజుగా పాటించనున్న నేపథ్యంలో, మెహిదీపట్నంలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
అయోధ్యలో మసీదు నిర్మాణానికి వేరే చోట ఐదు ఎకరాల స్థలం ఇవ్వాలనే సుప్రీంకోర్టు నిర్ణయం తమకు ఆమోదయోగ్యం కాదని అన్నారు. అయోధ్యలో బాబ్రీ మసీదును పునర్నిర్మించాలని కోరుతూ డిసెంబర్ 6న ప్రజాస్వామ్య, శాంతియుత పద్ధతిలో నిరసనలు తెలపాలని సూచించారు. ఆ రోజున అందరూ తమ దుకాణాలను తెరిచే ఉంచాలని చెప్పారు.